బాధ్యతతో మెలగండి

7 Feb, 2016 03:55 IST|Sakshi
బాధ్యతతో మెలగండి

కొత్త కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ సూచన
తమ బాధలు, కష్టాలు తొలగిపోతాయనే టీఆర్‌ఎస్‌కు ప్రజల పట్టం

వాటిని తీర్చే బాధ్యత కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉంది
ప్రజల ఆకాంక్షలకు తగినట్లు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచన
క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలసిన కార్పొరేటర్ల బృందం

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు కట్టబెట్టిన విజయం ఆషామాషీ విషయం కాదని... తమ బాధలు, కష్టాలు తొలగిపోతాయనే నమ్మకంతో ఈ మహత్తర విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు తమ దుఃఖాన్ని, కష్టాలను, సమస్యలను మన చేతుల్లో పెట్టారని, వాటిని తీర్చే బాధ్యత కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కోటి మంది జనాభా ఉంటే కేవలం 150 మందికి మాత్రమే కార్పొరేటర్లుగా పనిచేసే అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని ఎంత గొప్పగా సద్వినియోగం చేసుకుంటారన్నదే ముఖ్యమని కొత్త కార్పొరేటర్లకు సూచించారు.

 జీహెచ్‌ఎంసీకి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు కూడా సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్పొరేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. గ్రేటర్ ప్రజలు అతిపెద్ద, గొప్ప విజయాన్ని కట్టబెట్టారని.. వారి ఆకాంక్షలకు తగినట్లు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. జీవితంలో చాలా మందికి ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం వస్తుందని, పదవులు రావడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని చెప్పారు. ‘‘జీహెచ్‌ఎంసీ నుంచి ఖర్చు పెట్టే ప్రతీ పైసా పేదల సంక్షేమానికి ఉపయోగపడాలి. మంచినీరు, విద్యుత్, రహదారులు, మురికి కాలువలు తదితర మౌలిక సదుపాయాల విషయంలో మంచి ప్రణాళికలు రూపొందించాలి. హైదరాబాద్‌లోని పేదలకు ఈ ఏడాది లక్ష ఇళ్లు కట్టిద్దామనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు బాగా జరిగేలా చూడాలి..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

బాబు 15 సభలు పెడితే ఒకే సీటు వచ్చింది..
ఎన్నికల సందర్భంగా కొంత మంది ఆంధ్ర, తెలంగాణ అని విభజన తెచ్చే ప్రయత్నం చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ఏపీ సీఎం చంద్రబాబు దాదాపు 15 చోట్ల సభలు పెట్టిండు. వారికి జనం ఒక్క సీటు ఇచ్చిండ్రు. నేను కేవలం ఒకే సభ పెట్టిన. మనకు 99 సీట్లు ఇచ్చిం డ్రు. ప్రజలు మనపై నమ్మకం పెట్టిండ్రు. హైదరాబాద్ ప్రజలంతా మనల్ని నమ్మిండ్రు. వారి ఆకాంక్షలకు తగ్గట్లు పనిచేయాలె. నగరాభివృద్ధి కోసం, పేదల సంక్షే మం కోసం మంచి ప్రణాళిక తయారు చేసుకుందాం.

త్వరలోనే కార్పొరేటర్లకు రెండు రోజుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తం. నగరానికి ఏం చేద్దాం, నిధులు ఎలా ఖర్చు పెడదాం, ప్రణాళికాబద్ధంగా ఎలా ముందుకు పోదాం.. అనే విషయంపై చర్చిద్దాం. ఎవరూ వెయ్యేళ్లు బతకడానికి భూమ్మీదికి రాలేదు. ఉన్నకాలంలో ఎంత బాగా పనిచేశామన్నదే ముఖ్యం. మీరంతా కూడా మంచిగా పనిచేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటారనే నమ్మకం నాకుంది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు