Parliament Attack: జాతికి జవాబు కావాలి!

15 Dec, 2023 03:12 IST|Sakshi

దేశం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఘటన అది. ప్రధాని సహా పార్లమెంటరీ ప్రజాప్రతినిధులందరూ సమావేశమయ్యే ప్రాంగణంలోని పెను భద్రతా వైఫల్యాలను బుధవారం టీవీల సాక్షిగా కళ్ళకు కట్టిన ఉదంతమది. 2001 నాటి చేదు జ్ఞాపకాలను ఈ దురంతం మళ్ళీ గుర్తుచేసింది. అప్పట్లో పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదులు మన పార్లమెంట్‌పై తుపాకులతో దాడికి తెగబడితే, ఈసారి సందర్శకులుగా వచ్చిన ఇద్దరు భారతీయ సాధారణ యువకులు పదుల అడుగుల ఎత్తులోని లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ పై నుంచి సభాంగణంలోకి దూకి, రహస్యంగా తెచ్చిన పొగగొట్టాలతో అలజడి రేపారు. సభ వెలుపల రంగుల పొగతో మరో ఇద్దరు నిరసన పూర్వక నినాదాలు చేశారు. నలుగురినీ అరెస్ట్‌ చేసి, కఠినమైన ‘ఉపా’ చట్టం కింద కేసు పెట్టి పోలీస్‌ కస్టడీకి పంపారు. సూత్రధారుల కోసం గాలింపు సాగుతోంది. ప్రస్తుతానికి 8 మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు కానీ, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి.

ఇదేదో అప్పటికప్పుడు ఈ యువతీ యువకులు సృష్టించిన హంగామా కాదు. ఇరవై రెండేళ్ళ క్రితం పార్లమెంట్‌పై పాక్‌ తీవ్రవాదులు దాడి జరిపిన డిసెంబర్‌ 13నే... తమ దుశ్చర్యకు వారు ఎంచుకున్నారంటే ఎంత ఆలోచన, ప్రణాళిక ఉండివుంటుంది! ఒక్కపక్క అమెరికా గడ్డ మీద నుంచి హూంకరిస్తున్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్‌ సింగ్‌ పన్నూ ఈ నెలాఖరులోగా పార్లమెంట్‌పై దాడి చేస్తామని చాలా రోజుల క్రితమే హెచ్చరించారు. మరోపక్క పార్లమెంట్‌పై మునుపటి దాడిలో పలువురు బలైన ఘటనకు 22వ వార్షిక సంస్మరణ దినం. ఈ నేపథ్యంలో బుధవారం పార్లమెంట్‌ వద్ద ఎంత పారాహుషార్‌గా ఉండాలి! అంచెలంచెల తనిఖీని దాటుకొని, ఆ నలుగురూ కాలిజోళ్ళలో పొగగొట్టాలు పెట్టుకొని, లోపలికి వచ్చారంటే మన తనిఖీ, నిఘా వ్యవస్థలు నిద్రిస్తున్నట్టేగా! 

ప్రాథమిక సమాచారం మేరకు... పార్లమెంట్‌లో అలజడి రేపిన నలుగురిలో ఎవరూ తీవ్ర వాదులు కారు. మధ్య, దిగువ తరగతి నిరుద్యోగులు. భగత్‌ సింగ్‌ అభిమానులంటున్న వీరంతా దేశంలోని వేర్వేరు భౌగోళిక ప్రాంతాల నుంచి ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ఎలా ఒక్కటయ్యారు, ఎలా ఈ నిరసన దుశ్చర్యకు దిగారన్నది ఇంకా లోతుగా ఆరా తీయాలి. ఆరు డిగ్రీలు చేసి, లెక్చరర్‌ ఉద్యోగా నికి ‘నెట్‌’ సైతం పాసైన నిరుద్యోగ హర్యానా యువతి నీలమ్‌. కంప్యూటర్‌ ఇంజనీరైన నిరుద్యోగ మైసూరీ మధ్యవయస్కుడు మనోరంజన్‌. ఆర్మీలో చేరాలని ఆరాటపడి విఫలమైన కుర్రాడు అమోల్‌. లక్నోకు చెందిన ఇ–రిక్షా కార్మికుడు సాగర్‌ శర్మ. ఇలాంటి సామాన్యులు ఏ నిస్పృహలో, ఎవరి ప్రేరేపణతో చెడుదోవ పట్టి ఇంతటి దుస్సాహసానికి దిగినట్టు? వీరిని ఆడించిన అసలు నాయకుడు ఎవరు? ఇంటి దొంగలా, లేక దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్న విదేశీ శక్తులా? 


ఏడాదిగా ఈ పథకరచన సాగుతోందట. ఈ మార్చి, జూలైల్లోనూ పార్లమెంట్‌లో భద్రతపై రెక్కీ నిర్వహించారట. ఇది దిగ్భ్రాంతికరం. ప్రజాస్వామ్య దేవాలయంలో జరిగిన దుస్సాహసంపై ప్రజా ప్రతినిధులంతా ఏకమై పిడికిలి బిగించాల్సిన వేళ దురదృష్టవశాత్తూ రాజకీయాలు రేగుతున్నాయి. అధికారపార్టీ ఎంపీ నుంచి ఈ నిరసనకారులకు పాసులు జారీ కావడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడు తున్నాయి. పార్లమెంట్‌ సహా ఢిల్లీ భద్రత మొత్తం చేతిలో ఉండే హోమ్‌ మంత్రి ఈ మొత్తం ఘటనపై సభలో ప్రకటన చేయాలని కోరుతున్నాయి. జవాబివ్వాల్సిన అధికార పక్షం మొండికేయడం, రచ్చ పెరగడంతో ప్రతిపక్షానికి చెందిన 14 మందిని లోక్‌సభ నుంచి, ఒకరిని రాజ్యసభ నుంచి శీతకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం దీనికి పరాకాష్ఠ.   

సభలోనే కాదు ఢిల్లీలోనే లేని ఓ ప్రతిపక్ష ఎంపీ పేరు సైతం సస్పెండైన వారి పేర్లలో పేర్కొనడం విడ్డూరం. ఆ వాస్తవం రచ్చకెక్కేసరికి ‘అది క్లరికల్‌ మిస్టేక్‌’ అని సింపుల్‌గా తేల్చేస్తూ, 13మందే సస్పెండయ్యారని గురువారం పొద్దుపోయాక వివరణ నిచ్చుకోవాల్సి వచ్చింది. భద్రత విషయంలోనే కాదు... చివరకు సభా నిర్వహణలోనూ సర్కారీ నిర్లక్ష్యాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. నిరసన తెలిపే ప్రతిపక్షాలను పరోక్షంగా వెక్కిరిస్తూ, వచ్చి అరెస్టయినవారు ‘ఆందోళన్‌ జీవు’లంటూ అధి కారపక్షం తేలిగ్గా ముద్ర వేస్తోంది. ఒకవేళ వచ్చింది ‘ఆతంకవాదులై’ ఉంటేనో? వారు పొగగొట్టాలు కాక గ్రెనేడ్లు, ఐఈడీలు తేగలిగితేనో? ఏమై ఉండేది? భీతిగొలిపే ఆలోచన అది. అందుకే సర్వోన్నత పార్లమెంట్‌లోనే సభ్యుల రక్షణను వెక్కిరిస్తున్న ఘటనను ఆరోపణలపర్వంగా మారిస్తే లాభం లేదు. 

తీవ్రమైన ఈ భద్రతా వైఫల్యంపై జాతీయ భద్రతా ఏజెన్సీ సహా అత్యున్నత వ్యవస్థలతో దర్యాప్తు జరిపించాలి. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తోనూ పరిస్థితిని మదుపు చేయిస్తే, భద్రతా ఏర్పాట్లను పునస్సమీక్షిస్తే సభ్యులకు భరోసా కలుగుతుంది. దుర్భేద్యమని పదేపదే చెప్పిన కొత్త పార్లమెంట్‌ భవనంలోనే ఇంతటి ఘటన జరిగినందున అందరూ ఒకే గేటు నుంచి రాకపోకలు సాగించడం లాంటి పద్ధతులు మార్చాలి.  మెటల్‌ డిటెక్టర్లతో ప్లాస్టిక్‌ను గుర్తించలేనందున తనిఖీ విధానాల్ని ఆధునికీకరించి, పటిష్ఠపరచాలి. పార్లమెంటరీ సెక్యూరిటీలో నేటికీ వందకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయట. అదీ పట్టించుకోక కళ్ళు తెరిచి నిద్రపోతే నష్టం దేశానికి! అలాగే, ప్రభుత్వ గుర్తింపున్న పాత్రికేయుల్ని సైతం పార్లమెంట్‌లోకి రానివ్వని పాలకులు మహిళా రిజర్వేషన్‌ లాంటి కీలక బిల్లుల వేళ బస్సుల్లో జనాన్ని తరలించుకొచ్చి, గ్యాలరీ నుంచి నినాదాలిప్పిస్తున్న సంస్కృతిని విడ నాడాలి. పార్లమెంట్‌ ప్రాంగణం ప్రజాపాలనకై తప్ప, ప్రచార ఆర్భాటానికి కాదని గుర్తించాలి. మణి పూర్‌ మొదలు జాతీయ భద్రత దాకా ప్రతిదానిపైనా ప్రభుత్వ జవాబు కోసం, జవాబుదారీతనం కోసం ఇంతగా పట్టుబట్టాల్సి రావడం మాత్రం ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదని గ్రహించాలి.  

>
మరిన్ని వార్తలు