మేడిగడ్డకు త్వరలోనే శంకుస్థాపన

9 Mar, 2016 03:03 IST|Sakshi
మేడిగడ్డకు త్వరలోనే శంకుస్థాపన

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్
► శంకుస్థాపనకు రానున్న మహారాష్ట్ర
     సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి గడ్కరీ


 సాక్షి, హైదరాబాద్: గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. మహారాష్ట్ర పర్యటన అనంతరం క్యాంపు కార్యాలయంలో తనను కలవడానికి వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం మాట్లాడారు. ముంబై పర్యటన విజయవంతమైందని, మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. త్వరలోనే మేడిగడ్డ బ్యారేజీకి శంకుస్థాపన చేస్తామని, ఈ కార్యక్రమానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో వరంగల్, కరీంనగర్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, ఈ రెండు జిల్లాలు గోదావరి జిల్లాలుగా మారబోతున్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు పూర్వవైభవం వస్తుందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌తో ఎస్సారెస్పీకి కూడా మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీరు పంపించవచ్చని, ఉత్తర తెలంగాణతో పాటు అవసరమనుకుంటే దక్షిణ తెలంగాణకు నీటిని అందించేలా ప్రాజెక్టులు డిజైన్ చేసుకోవాలని అన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి ద్వారా పెద్ద మొత్తంలో నీరు గోదావరిలో కలుస్తోందని, ఏడాదికి సగటున2,423 టీఎంసీల నీరు దిగువకు పోతోందని సీఎం చెప్పారు. ఈ నీటిని పంట పొలాలకు అందించటమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు సూచించారు. ఖమ్మం జిల్లాలో గోదావరిపై దుమ్ముగూడెం బ్యారేజీ నుంచి జగన్నాథపురం, రోళ్లపాడు రిజర్వాయర్ల ద్వారా జిల్లా మొత్తానికి నీరందించగలుగుతామన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భూసేకరణ తదితర పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని, ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జగదీష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, హైదరాబాద్ నుంచి బోధన్ వరకు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ఈ మేరకు మంగళవారం గడ్కరీతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-బోధన్ రహదారిలో రద్దీ ఎక్కువైందని, అందుకే జాతీయ రహదారిగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. బోధన్ నుంచి ఇప్పటికే మహారాష్ట్రకు జాతీయ రహదారి ఉన్నందున 2 రాష్ట్రాల మధ్య రవాణాకు ఇది దోహదపడుతుందని సీఎం చెప్పారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాన్ని వివరించి, ఒప్పందానికి సహకరించినందుకు గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
 
మహారాష్ట్ర గవర్నర్‌కు కృతజ్ఞతలు
 అంతర్రాష్ట ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం కుదరడంలో ముఖ్య పాత్ర పోషించటంతో పాటు సహకరించిన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో ఒప్పందం కుదిరిన తర్వాత ఆయన రాజ్‌భవన్‌లో విద్యాసాగర్‌రావును కలిశారు. మేడిగడ్డ బ్యారేజీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
 

మరిన్ని వార్తలు