Tomato Prices: మళ్లీ పెరుగుతు​న్న టమాటా రేట్లు

21 Nov, 2023 11:13 IST|Sakshi

దీపావళి అనంతరం మార్కెట్‌లో టమాటా ధర ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, ఈ ఏడాది వర్షాభావంతో టమోటా పంట దెబ్బతింది. ఫలితంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌తో సహా  విదర్భలోని రిటైల్ మార్కెట్‌లో టమోటాలు కిలోకు రూ.55 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. 

పెరుగుతున్న టమాట ధరలు ఉల్లి ధరలతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి  టమాటాలను విక్రయించేందుకు నాగ్‌పూర్‌లోని కలమన మండీకి తీసుకువస్తుంటారు. అయితే ఈసారి చాలా తక్కువగా టమాటాలు వస్తుండటంతో వీటి ధరలు మళ్లీ పెరిగాయి. 

టమాటా వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద ఎత్తున టమోటాలు కలమన మండీకి వస్తుంటాయి. ఫలితంగా ధరలు తక్కువగా ఉంటాయి. కాగా పొలంలో టమోటాలు పండించిన రైతులు వాటిని మార్కెట్‌కు తీసుకురావాలంటే  రవాణా ఖర్చులు భారీగా అవుతుంటాయి. ఈ కారణంగా రైతులు టమోటాలను రోడ్లపై పారవేస్తుంటారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదు. టమాటాలు డిమాండ్‌కు తగ్గట్టుగానే సరఫరా అవుతున్నాయి. 

ప్రస్తుతం ఆంధ్ర, బెంగళూరు నుంచి టమోటాలు నాగపూర్‌కు విక్రయానికి వస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో టమాటా ధర నాణ్యతను బట్టి రూ. 40 నుండి 45 వరకు ఉంటుంది. నాగపూర్‌ పట్టణానికి ప్రతీరోజు 15 నుండి 16 ట్రక్కుల టమాటాలు వస్తున్నాయి. పెరుగుతున్న టమాటా ధరలు ఉల్లికి గట్టి పోటీనిస్తున్నాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.65 నుంచి రూ.70 పలుకుతోంది. మార్కెట్‌లో ఉల్లి రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు!

మరిన్ని వార్తలు