తడిసిమోపెడు

16 Jan, 2014 03:52 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో:  ‘ఉన్న నాలుకకు మందేస్తే..కొండనాలుక ఊడిందన్నట్లుంది..’ గ్రేటర్ ఆర్టీసీ పరిస్థితి. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు వ్యయం తగ్గించుకోవాలని కొన్నాళ్ల కిందట ప్రవేశపెట్టిన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) బస్సులు ప్రస్తుతం సంస్థకు భారంగా మారాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ బస్సులు పెద్దగుదిబండగా మారాయని నూటికి నూరుపాళ్లు చెప్పొచ్చు.

దీంతో అధికారులు ఇప్పుడున్న బస్సులకంటే ఒక్క బస్సును కూడా కొత్తగా ప్రవేశపెట్టేందుకు జంకుతున్నారు. ప్రస్తుతం నగరంలో 110 సీఎన్జీ బస్సులు నడుస్తున్నాయి. ఒక్కో బస్సుకు ప్రతిరోజు 80 కిలోల గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఈ మేరకు రోజుకు 8800 కిలోల సీఎన్‌జీని బీజీఎల్ (భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్) నుంచి ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత సీఎన్‌జీ ధరల ప్రకారం ప్రతిరోజు ఈ ఇంధనం కోసం ఆర్టీసీ రూ.4,84,000 వెచ్చిస్తోంది. ప్రస్తుతం కిలో సీఎన్‌జీ రూ.55కు లభిస్తుండగా,లీటర్ డీజిల్ రూ.58.60కి లభిస్తోంది.

 ఈ రెండింటి మధ్య కేవలం 3.60 వ్యత్యాసం ఉండడం,పైగా డీజిల్ కంటే సీఎన్జీ ఇంధన వినియోగం అత్యధికంగా ఉండడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని సీఎన్‌జీ బస్సుల పెంపును ఆర్టీసీ ఉపసంహరించుకుంది. డీజిల్ బస్సులను కూడా సీఎన్జీలోకి మార్చడం కూడా బాగా ఖర్చుతో కూడుకున్న పనికావడం గమనార్హం. ఒక లీటర్ డీజిల్ వల్ల మెట్రో బస్సులు 4కిలోమీటర్లు, ఆర్డినరీ బస్సులు 5 కి.మీ మైలేజీ వస్తుంటే...అదే సీఎన్జీ బస్సులు 3 కిలోమీటర్లకు మించి పరుగులు తీయలేకపోతున్నాయి.  

 భారం భారీగా..: గ్రేటర్‌లో ఆర్డినరీ బస్సులకు మాత్రమే సీఎన్జీని వినియోగిస్తున్నారు. ఒక బస్సు ప్రతిరోజు 240 కి.మీ దూరం వెళ్లాలంటే ప్రతి 3 కిలోమీటర్లకు ఒకకిలో చొప్పున 80 కిలోల సీఎన్జీ అవసరం. ఇందుకోసం రూ.4,400 ఖర్చవుతోంది. ఒక  ఆర్డినరీ బస్సు ఒక లీటర్ డీజిల్‌కు 5 కిలోమీటర్ల చొప్పున  కేవలం 50 లీటర్లకే 250 కిలోమీటర్లు పయనిస్తుంది. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర (రూ.58.60) ప్రకారం 250 కిలోమీటర్ల దూరానికి రూ.2930 ఖర్చవుతుంది.

 ఇది సీఎన్జీ వినియోగం వల్ల వచ్చే ఖర్చు కంటే తక్కువ. 110 డీజిల్ బస్సుల నిర్వహణకు రోజుకయ్యే ఖర్చు రూ.3,22,300. సీఎన్జీ బస్సుల కంటే  (రూ.4,84,000) తక్కువ. ఈ లెక్కన డీజిల్ కంటే సీఎన్జీ భారమే ఆర్టీసీపై ఎక్కువగా ఉందని, ఏటా ఇందుకోసం రూ.కోట్లు వెచ్చించాల్సి వస్తోందని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

 ఒక్కటి కూడా పెంచేది లేదు.. : సీఎన్జీ బస్సులు ఆర్థికంగా భారమవుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న బస్సులకంటే ఒక్క బస్సును కూడా పెంచేది లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రోజురోజుకు భయానకమవుతున్న వాహన కాలుష్యం దృష్ట్యా అన్నిరకాల వాహనాలు సీఎన్జీ వినియోగంలోకి మారాలని,  ఆర్టీసీ వెంటనే ఆమార్పును చేపట్టాలని డాక్టర్ భూరేలాల్ కమిటీ గతంలో చేసిన సిఫార్సులు ప్రహసంగానే మిగిలాయని చెప్పొచ్చు.

 అరకొర సరఫరా: మేడ్చల్,కంటోన్మెంట్,హకీంపేట డిపోల్లో మొదట 350 బస్సుల ను సీఎన్జీలోకి మార్చి ఆ తర్వాత గ్యాస్ సరఫరా పెరిగే కొద్దీ దశలవారీగా అన్ని బస్సులను సీఎన్జీ వినియోగంలోకి తేవాలని అధికారులు భావించారు. ఈ మేరకు ఈ మూడు డిపోల్లో గ్యాస్ నిల్వకోసం ట్యాంకులు (డాటర్ స్టేషన్స్) నిర్మించారు. కానీ ఆశించిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో 110 బస్సులకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ బస్సులకు కూడా సిలిండర్ల ద్వారా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సరఫరా చేస్తోంది.

>
మరిన్ని వార్తలు