అయోమయం..!

4 Jan, 2014 04:09 IST|Sakshi

=తేలని మేయర్, డిప్యూటీ రాజీనామాల వ్యవహారం
 =పార్టీ నేతలకు, కార్పొరేటర్లకూ స్పష్టత లేని వైనం

 
సాక్షి, సిటీబ్యూరో : ఆశావహుల హడావుడి తప్ప.. మేయర్, డిప్యూటీ మేయర్‌ల మార్పునకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. కాంగ్రెస్-ఎంఐఎం కూటమి ఒప్పందం మేరకు, మేయర్ మాజిద్‌హుస్సేన్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్‌ల గడువు ముగిసినందున.. వారి స్థానాల్లో కొత్త మేయర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి, కొత్త డిప్యూటీ మేయర్‌గా ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక కావాల్సి ఉంది. ఒప్పందం మేరకు నడచుకుంటామని ఎంఐఎం చెబుతున్నప్పటికీ.. కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇందుకు సంబంధించి రెండు పార్టీలు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మేయర్, డిప్యూటీ మేయర్ల మార్పునకు సంబంధించిన ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందంటే.. ఏ పార్టీ కార్పొరేటర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. వారే కాదు..  మేయర్, డిప్యూటీ మేయర్‌లు సైతం అంతా అధిష్ఠానం చూసుకుంటుం దంటున్నారే తప్ప.. తామెప్పుడు రాజీనామాలు చేయాల్సి ఉంటుందో తమకే తెలియదంటున్నారు. మరోవైపు.. వారి పార్టీ అభ్యర్థికి మేయర్ పదవి అప్పగించడంపై కాంగ్రెస్ నేతలు ఆసక్తి, చొరవ చూపడం లేరని ఎంఐఎం వర్గాలు సైతం భావిస్తున్నాయి.

‘ఒప్పందానికి అనుగుణంగా నడచుకోవాలని కాంగ్రెస్ నుంచి ఎంఐఎంకు లేఖ ఇచ్చారంటున్నారు. ఆ ఉత్తరానికి తగిన జవాబు ఆశించడం కానీ.. త్వరగా ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి కానీ కాంగ్రెస్ నుంచి లేవు. వీటిని బట్టి చూస్తుంటే.. కాంగ్రెస్‌కు మేయర్ మార్పుపై పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు’ అంటూ జీహెచ్‌ఎంసీలోని ఎంఐఎం ముఖ్యనాయకుడొకరు వ్యాఖ్యానించారు.
 
ఎవరు ముందు రాజీనామా చేయాలి..?
 
మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరి మార్పు జరగనున్నందున తొలుత ఎవరు రాజీనామా చేయాలనేది ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో చర్చనీయాంశంగా మారింది. జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు డిప్యూటీ మేయర్ రాజీనామాను మేయర్ ఆమోదించాల్సి ఉండగా, మేయర్ రాజీనామాను మేయర్ అధ్యక్షతన సమావేశమయ్యే కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంది. ఇది అమలయ్యేందుకు డిప్యూటీ మేయర్ తొలుత రాజీనామా చేయాలని దారుస్సలాం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాగా.. మేయర్ ముందే రాజీనామా చేసినా.. కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందేంతవరకు మేయర్‌గా కొనసాగుతారు కనుక.. మేయరే తొలుత రాజీనామా చేసి కౌన్సిల్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని.. సమావేశానికి ఒక్కరోజు ముందుగా డిప్యూటీ మేయర్ రాజీనామా చేసినా సరిపోతుందంటున్నారు. గతంలో మేయర్ కార్తీకరెడ్డి, డిప్యూటీ మేయర్ జాఫర్‌హుస్సేన్‌లు ఇలాగే రాజీనామాలు చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో 2011 డిసెంబర్5న కార్తీకరెడ్డి మేయర్ పదవికి రాజీనామా లేఖ ఇచ్చి.. ఆమోదం కోసం డిసెంబర్ 17న కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16న డిప్యూటీ మేయర్ రాజీనామా చే శారు. కౌన్సిల్ సమావేశానికి ముందుగా ఆయన రాజీనామాను ఆమోదించారు. కార్తీకరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం ఆమె రాజీనామాను ఆమోదించింది.
 
మేయర్ రాజీనామాపై అనుమానాలు
 
మేయర్ మాజిద్ రాజీనామా చేసే సూచనలు కనిపించడం లేదు. పెపైచ్చు.. జీహెచ్‌ఎంసీ ఆవరణలో ముసుగు కప్పి ఉన్న విగ్రహాలను తన హయాంలోనే తరలిస్తానని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. అంటే.. మరికొంత కాలం ఉంటారన్నమాటేగా అన్న వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి. అంతే కాదు.. ప్రతినెలా మొదటి శనివారం మేయర్ అధ్యక్షతన జరిగే ‘ ఫేస్ టు ఫేస్’ కార్యక్రమానికి సంబంధించి ఒకరోజు ముందు పత్రికాప్రకటన విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం రెండు రోజుల ముందుగా ప్రకటన విడుదల చేశారు. ఎందుకలా అంటే.. ‘మేయర్ రాజీనామా చేయరు.. కొనసాగుతారు..’ అని చెప్పడానికేన నే సమాధానం వెలువడింది.
 

మరిన్ని వార్తలు