ప్రభుత్వ భూములపై ‘టెక్‌’ నిఘా!

16 Mar, 2017 01:06 IST|Sakshi
ప్రభుత్వ భూములపై ‘టెక్‌’ నిఘా!

ప్రభుత్వ భూములపై నిరంతర పర్యవేక్షణ
ప్రత్యేకంగా జియో ట్యాగింగ్‌కు నిర్ణయం
తొలివిడతగా వెయ్యి స్థలాల గుర్తింపు
రేపు జీహెచ్‌ఎంసీలో సిబ్బందికి శిక్షణ


సిటీబ్యూరో : ప్రభుత్వ భూముల పరిరక్షణకు టెక్నాలజీని వాడుకోవాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఆక్రమణల నుంచి రక్షించడమే కాకుండా నిరంతరం ఆయా భూములను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు వాటికి జియో ట్యాగింగ్‌ చేయాలని యోచిస్తోంది. తద్వారా అక్రమార్కులకు కళ్లెం వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా ప్రభుత్వ భూములను ట్యాగింగ్‌ చేస్తే మంచి ఫలితాలుంటాయని అంచనా వేస్తోంది. ఈ మేరకు కోట్లాది రూపాలయ విలువైన సుమారు వెయ్యి ప్రభుత్వ స్థలాల పార్శిల్స్‌లను అధికారులు  గుర్తించారు.

భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా ప్రతి పార్శిల్‌ను ట్యాగింగ్‌ చేస్తారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న జియో ట్యాగింగ్‌ విధానానికి రెవెన్యూ శాఖ కూడా సిద్ధమవుతోంది. జియో ట్యాగింగ్‌ చేసిన ప్రతి పార్శిల్‌ చిత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరిగి అప్‌డేట్‌ అవుతుంది. అధికార యంత్రాంగం జియో ట్యాగింగ్‌ అప్‌డేట్‌ పరిశీలించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం సిద్ధం చేస్తోంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అలజడి, నిర్మాణం జరిగినా అప్‌డేట్‌ చిత్రం ద్వారా గుర్తించవచ్చు. తక్షణమే అడ్డుకునే చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది. జియా ట్యాకింగ్‌ విధానంతో కోట్లాది రూపాయల విలువగల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకు వీలుంటుందని అధికార యంత్రాంగం భావిస్తోంది.  

వెయ్యి పార్శిల్స్‌కు ట్యాగింగ్‌
జిల్లా యంత్రాంగం తొలి విడతగా ప్రభుత్వ భూముల వెయ్యి పార్శిల్‌లను ట్యాగింగ్‌ చే యనుంది. దీని విలువ వందల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. నగరంలో మొత్తం మీద 54, 447 ప్రభుత్వ స్థలాలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  రెవెన్యూ శాఖకు సంబంధించిన 15,376, ఇతర శాఖలకు చెందిన 33,184, శిఖం, నాలా, కాల్వలకు సంబంధించిన 669, శ్మశాన వాటికలకు సంబంధించిన 961,  ఇనామ్‌ 73,  కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 826, వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన 1188,  ఎండోమెంట్‌కు చెందిన 1359, మిగులు భూమి 543 పార్శిల్స్‌ ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో వైపు సుమారు 1316 స్థలాలపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలి విడతగా మండలాల వారిగా ప్రాధాన్యత క్రమంలో విలువైన ప్రభుత్వ భూములను గుర్తించి జియో ట్యాగింగ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రేపు జియో ట్యాగింగ్‌పై శిక్షణ
భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా ప్రభుత్వ భూముల ట్యాగింగ్‌పై రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. జీహెచ్‌ఎంసీలో ఈనెల 17న గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లకు ట్యాగింగ్‌ శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రతి మండల వీఆర్వో, సర్వేయర్లు విధిగా శిక్షణకు హజరయ్యే విధంగా తహశీల్దార్లకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే మండలాల వారిగా ల్యాప్‌టాప్‌లను అందించారు. ల్యాప్‌టాప్‌ల్లో జియో ట్యాగింగ్‌కు సంబంధించిన స్టాఫ్‌వేర్‌ను ఇన్‌స్టలేషన్‌ చేస్తారు. భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా పతి పార్శిల్‌ను ఎలా ట్యాగింగ్‌ చేయాలో అవగాహన కల్పిస్తారు. ప్రతి మండలంలో వార్డులు, బ్లాక్‌ల వారిగా ప్రభుత్వ భూముల పార్శిల్స్‌ను ట్యాగింగ్‌ చేసి మ్యాపింగ్‌లో భద్రపరుస్తారు. శాటిలైట్‌ ద్వారా భూముల ట్యాగింగ్‌ అప్‌డేట్‌లను పరిశీలిస్తారు. తొలివిడత గుర్తించిన పార్శిల్స్‌ జియో ట్యాగింగ్‌ పూర్తయితే రెండో విడతగా మరికొన్ని ప్రభుత్వ భూములను ట్యాగింగ్‌ చేస్తారు.

ప్రభుత్వ భూములను రక్షిస్తాం
ప్రభుత్వ భూములను పూర్తి స్థాయిలో పరిరక్షిస్తాం. ప్రాధాన్యత గల సుమారు వెయ్యి స్థలాలను గుర్తించి జియో ట్యాగింగ్‌ చేస్తున్నాం. ట్యాగింగ్‌ చేసిన భూముల్లో ఎలాంటి కదలిక జరిగినా గుర్తించవచ్చు. తక్షణమే అడ్డుకునే చర్యలు చేపట్టవచ్చు. జియో ట్యాగింగ్‌లో మరింత అధునికత పరిజ్ఞానం రావచ్చు. దీంతో ప్రభుత్వ స్థలాల రక్షణకు మరింత దోహదపడే అవకాశం ఉంది.
– ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్, హైదరాబాద్‌


 

>
మరిన్ని వార్తలు