మండలిలో ప్రశ్నల వివాదం

17 Mar, 2016 01:07 IST|Sakshi
మండలిలో ప్రశ్నల వివాదం

సభ్యుల లంబా స్పీచ్‌లతో కాలాతీతమవుతోంది: స్వామిగౌడ్
 
 సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఒక్కో ప్రశ్నపై సభ్యులు పలు ఉప ప్రశ్నలు వేయడంతో అది లఘు చర్చకు దారితీస్తోందనీ, అందువల్ల మూడు ప్రశ్నల అనంతరం ప్రత్యేక ప్రస్తావన చేపడతానని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. దీంతో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములునాయక్, పాతూరి సుధాకర్‌రెడ్డి, పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు తమ ప్రశ్నలను యథాతథంగా కొనసాగించాల్సిందిగా అభ్యర్థించారు.

ఈ దశలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ప్రశ్న సంక్షిప్తంగా ఉంటే తమ సమాధానం సంక్షిప్తంగానే ఉంటుందని, పార్టీకి ఒకరికి అవకాశమిస్తే సరిపోతుందని సూచించారు. లేదంటే రోజుకు 2,3 ప్రశ్నల కంటే ఎక్కువరావని, చైర్మన్ ఆ దిశలో ఆలోచించాలని కోరారు.   ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ.. చైర్‌ను మంత్రి డిక్టేట్ చేసే పద్ధతి సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, భానుప్రసాద్, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధరగౌడ్ తమ స్థానాల్లో నిలబడి అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పొంగులేటి, ఎం.రంగారెడ్డి, కె.రాజగోపాల్‌రెడ్డి కూడా తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు.

ఈ క్రమంలో పొంగులేటి-పాతూరిల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందిస్తూ తమకు  చైర్‌పై అత్యంత గౌరవముందని, సభను ఎట్లా నడపాలో సూచనలు, విజ్ఞప్తులు మాత్రమే చేయగలమనీ, చైర్‌ను డెరైక్ట్ చేసే అధికారం లేదన్నారు. సభ్యులు ‘లంబా లంబా  స్పీచ్‌లిస్తుండడంతో కాలాతీతమవుతోందనీ, కొందరు సభ్యులు అనుబంధ ప్రశ్నలు వేస్తున్నారే తప్ప ఇంట్లో కూర్చుని ప్రశ్నలు రాయలేకపోతున్నారని చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఇకపై ప్రశ్నపై సంతకం చేసిన వారికే పరిమితమవుదామని ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని మళ్లీ ప్రారంభించి అన్ని ప్రశ్నలు పూర్తిచేశారు.

మరిన్ని వార్తలు