జాతీయ సదస్సుకు.. బాపట్ల ముస్తాబు | Sakshi
Sakshi News home page

జాతీయ సదస్సుకు.. బాపట్ల ముస్తాబు

Published Thu, Mar 17 2016 12:57 AM

జాతీయ సదస్సుకు..  బాపట్ల ముస్తాబు

వ్యవసాయ కళాశాలలో స్టాల్స్ ఏర్పాటు
17 రాష్ట్రాల నుంచి 500 మంది మహిళా రైతులు   రాక
ఏర్పాట్లను సమీక్షిస్తున్న రెవెన్యూ, వ్యవసాయ శాఖలు
17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సదస్సు

 
బాపట్ల : జాతీయ స్థాయిలో జరిగే మహిళా రైతుల సదస్సుకు బాపట్ల ముస్తాబవుతోంది. ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు వ్యవసాయ కళాశాలలో జరగనున్న సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.

 రాణిస్తున్న మహిళా రైతు..  
వ్యవసాయ రంగంలో పురుషులతో పాటు మహిళలు కూడా రాణించగలరు.. సాగుకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి పంట చేతికొచ్చేంతవరకు ఎక్కువగా కష్టపడేది మహిళలే. అయినా వాళ్లకు ఆ రంగంలో తగిన గుర్తింపు ఉండటం లేదు. యంత్ర పరికరాలు కూడా పురుషుల పనిభారాన్ని తగ్గించే విధంగానే రూపొందిస్తున్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క పరికరం అందుబాటులోకి రావడం లేదు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ, పశువుల పెంపకంలో కూడా మహిళలే ఎక్కువుగా రాణిస్తున్నారు.

మహిళల పేరుతో కనీసం సెంటు పొలం కూడా లేకుండా రెవెన్యూ రికార్డుల్లో కూడా పొలాలు పురుషుల పేరుతోనే ఉండటంతో అసహనానికి గురైన మహిళలు తమకంటూ ప్రత్యేకతను కల్పించుకోవాలనే తలంపుతో జాతీయ స్థాయి సదస్సును బాపట్లలో ఏర్పాటు చేస్తున్నారు. బాపట్లలో వ్యవసాయ కళాశాలతో పాటు అనుబంధ కళాశాలలైన వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల, ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల, వ్యవసాయ కళాక్షేత్రం, ఉప్పునీటి పరిశోధన స్థానం, ఫోస్ట్ హార్వెస్ట్ కేంద్రాలు అందుబాటులో ఉండటంతో ఇక్కడ జాతీయ స్థాయి మహిళా సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో 17 రాష్ట్రాల నుంచి 500 మంది మహిళలు పాల్గొననున్నారు.

ఆకట్టుకోనున్న స్టాల్స్..      
బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ చేసే విధానం, సాగులో ఎదుర్కొనే ఇబ్బందులు, సాగుకు అయ్యే ఖర్చు, వచ్చే దిగుబడులు, ఆయా రాష్ట్రాల్లో ఉపయోగించే యాత్రీకరణ విధానాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆహారం, తాగునీరు, వసతి, ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు అన్నిరకాల ఏర్పాట్లను వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో మహిళా రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు, కళాశాలలోని ఆట స్థలంలో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement