క్రైమ్ మ్యాపింగ్!

2 Mar, 2016 00:26 IST|Sakshi
క్రైమ్ మ్యాపింగ్!

ప్రత్యేక యాప్ రూపొందించిన ఐటీ సెల్
నేరాలు జరిగే ప్రాంతాల డిజిటలైజేషన్
త్వరిత గతిన సమాచార సేకరణ..నేరాల నియంత్రణే లక్ష్యం
అన్ని స్థాయిల సిబ్బందికీ అందుబాటులోకి

 
నేరాల నియంత్రణకు...కేసుల విచారణ త్వరితగతిన చేపట్టేందుకు...దోషుల్ని వేగవంతంగా పట్టుకునేందుకు నగర పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు టెక్నాలజీని వినియోగించుకుంటోంది. తాజాగా సిటీ పోలీస్ ఐటీ సెల్ ‘క్రైమ్ మ్యాపింగ్’ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. త్వరిత గతిన నేరాల సమాచారం అందించడం..అవసరమైన వివరాలు వేగవంతంగా తెలుసుకోవడం..మరిన్ని నేరాలు జరగకుండా నియంత్రించడానికి ఈ క్రైమ్ మ్యాపింగ్ ఎంతో ఉపయోగపడుతుంది.        - సాక్షి, సిటీబ్యూరో
 
సిటీబ్యూరో:
నగరంలోని ఏ ప్రాంతంలో ఏ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి..?
ఏదైనా నేరం చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలో ఎక్కడ సీసీ కెమెరాలున్నాయి..?
ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ నగరంలో నేరాలు చేసే ముఠాలు ఎన్ని? ఏ తరహావి?
ఫలానా ప్రాంతంలో జరిగిన నేరానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ నెంబర్ ఎంత?  కేసు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది?
 
నేరాల నియంత్రణ (ప్రివెన్షన్), కేసుల్ని కొలిక్కి తేవడం (డిటెక్షన్)కు ఈ వివరాలు ఎంతో కీలకం. అయితే వీటిని మాన్యువల్‌గా తీసుకోవాలంటే... దాదాపు వారం రోజులు పడుతుంది. ఈ లోపు నేరం చేసిన వ్యక్తి ‘తీరం’ దాటిపోయే అవకాశం ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసు ఐటీ సెల్ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. క్రైమ్ మ్యాపింగ్ పేరుతో తయారు చేసిన దీన్ని కమిషనరేట్‌లోని అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌లో ఉండే ప్రత్యేకతల్లో కీలకమైనవి...
 
థిమేటిక్ క్రైమ్ మ్యాప్
 నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకే సమయంలో ఒకే తరహా నేరాలు జరుగవు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయన్నది తెలుసుకోవడం ద్వారానే వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధిష్టంగా తెలుసుకోవడానికి ‘క్రైమ్ మ్యాపింగ్’లో ‘థిమేటిక్ క్రైమ్ మ్యాప్’ విభాగం ఏర్పాటు చేశారు. ఓ అధికారి/సిబ్బంది ఇందులోకి ప్రవేశించడం ద్వారా తనకు అవసరమైన తేదీల మధ్య ఏ ప్రాంతంలో, ఏ తరహా నేరాలు జరిగాయో సంఖ్యలతో సహా తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్య, హత్యాయత్నం... ప్రాప ర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దొంగతనాలు తదితరాలతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల వివరాలనూ పొందుపరిచారు.

క్రైమ్ ప్రోన్ రిపోర్ట్
కమిషనరేట్‌లోని జోన్లు, సబ్-డివిజన్లు, పోలీసుస్టేషన్ల వారీగా ఏ తరహా నేరాలు, ఏ సమయంలో, ఏఏ రోజుల్లో, ఏ విధంగా జరుగుతున్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటు నగరంలో ఓ ఠాణా పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎక్కడ నేరాలు జరుగుతున్నాయనేది స్పష్టంగా చూపిస్తుంది. ఆ ఠాణా పరిధిలో ఏ పరిధి (కిలోమీటర్ల విస్తీర్ణంతో సహా) నేరాలకు ఆలవాలంగా మారిందనేదీ మ్యాప్‌పైన చూపిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఆయా రోజులు, సమయాల్లో ప్రత్యేక దృష్టి సారించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయవచ్చు. మరోపక్క ఠాణాల పరిధిలో గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు, రక్షక్‌లను ఆయా సమయాల్లో నిర్దేశిత ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి పెట్టేలా ఠాణా అధికారులూ వ్యూహం సిద్ధం చేసుకునే ఆస్కారం ఏర్పడుతుంది.

క్రైమ్ రాడార్
సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను మ్యాప్ పైకి తీసుకువచ్చారు. స్నాచింగ్, అటెన్షన్ డైవర్షన్‌తో పాటు ఇతర నేరాలు చోటు చేసుకున్న సమయంలో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుంటారు. అయితే అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఆ క్రైమ్ సీన్‌కు సమీపంలో, దారితీసే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం కొంత సమయం పడుతోంది. అలాంటి జాప్యానికీ తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ఈ యాప్‌లోని క్రైమ్ రాడార్‌లోకి ప్రవేశిస్తే చాలు. ఈ నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయనేది చూపిస్తుంది. మ్యాప్ పైన కనిపించే కెమెరా మార్క్ వద్ద క్లిక్ చేస్తే.. అది ఎక్కడ ఉందనే చిరునామా సైతం పాప్‌అప్ రూపంలో ప్రత్యక్షమవుతుంది.

సీసీఆర్బీ సెర్చ్
నగరంలో చైన్ స్నాచింగ్స్, సూడో పోలీసు, దృష్టి మళ్లించి దండుకోవడం తదితర నేరాలు చేసే ముఠాల్లో అనేకం బయటి రాష్ట్రాల నుంచే వచ్చిపోతుంటాయి. ఒకప్పుడు ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన ముఠా నగరంలో ఏ తరహా నేరాలు చేసింది అనే వివరాలు కేవలం సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)తో పాటు కొన్ని ప్రత్యేక విభాగాల దగ్గరే అందుబాటులో ఉండేవి. దీంతో ఠాణా అధికారులు వీరిని సంప్రదించి, ఆయా నేరగాళ్ల చిరుమానాలు తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలకు ఆస్కారం ఉండేది. ‘క్రైమ్ మ్యాపింగ్’లో ఏర్పాటు చేసిన సీసీఆర్బీ సెర్చ్‌లో నేరం స్వభావం లేదా అనుమానితుల పేర్లు తదితరాలను ఎంటర్ చేస్తే చాలు... దేశంలోని ఏ ప్రాంతంలో వారు ఉంటారు అనేది చూపిస్తుంది.
 
ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఎంట్రీలు
ఈ ‘క్రైమ్ మ్యాపింగ్’ యాప్‌లోకి ఎంట్రీలన్నీ పోలీసుస్టేషన్ స్థాయిలోనే జరిగేలా ఐటీ సెల్ ఇన్‌చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదు అందుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే సమయంలోనే ఠాణాల్లో ఉండే ఈ-కాప్స్ సిబ్బంది ఆ వివరాలను క్రైమ్ మ్యాపింగ్‌లో పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలోనే థిమేటిక్ క్రైమ్ మ్యాప్, క్రైమ్ ప్రోన్ రిపోర్ట్ విభాగాల్లో సెర్చ్ చేసినప్పుడు ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ నెంబర్లు, అవి నమోదైన తేదీలు సైతం ప్రత్యక్షమయ్యే సౌలభ్యం ఉంది. మ్యాప్‌లో దర్యాప్తు అధికారులు తమకు అవసమైన చోట కల్సర్ పెడితే.. పాప్‌అప్ రూపంలో అదనపు సమాచారం కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ క్రైమ్ మ్యాపింగ్‌లో మరికొన్ని చేర్చవచ్చు.
 

మరిన్ని వార్తలు