కటాఫ్‌ డేట్‌ 2016 డిసెంబర్‌ 4

21 Feb, 2017 02:12 IST|Sakshi
కటాఫ్‌ డేట్‌ 2016 డిసెంబర్‌ 4

విద్యుత్‌ కాంట్రాక్ట్,ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు..
టీఎస్‌పీసీసీలో నిర్ణయించిన విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు
28లోగా ఔట్‌ సోర్సింగ్‌ వివరాల సమర్పణకు ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2016 డిసెంబర్‌ 4ను కటాఫ్‌ డేట్‌గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సమన్వయ కమిటీ (టీఎస్‌పీసీసీ) సమావేశంలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల యాజమాన్యాలు ఈ మేరకు తీర్మానం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కటాఫ్‌ తేదీలోగా విద్యుత్‌ సంస్థల్లో నియామకం పొందిన కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా పరిగణించనున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కటాఫ్‌ తేదీని విద్యుత్‌ సంస్థలు ఖరారు చేశాయి. త్వరలో జారీ చేయనున్న క్రమబద్ధీకరణ మార్గదర్శకాల్లో కటాఫ్‌ తేదీగా చేర్చనున్నారు.

28లోగా ‘ఔట్‌ సోర్సింగ్‌’ వివరాలు
విద్యుత్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు కసరత్తు ప్రారంభించాయి. క్షేత్రస్థాయిలో జోన్లు, డివిజన్లు, పవర్‌ స్టేషన్ల వారీగా పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిర్దేశించిన ఫార్మాట్లలో ఈనెల 28 లోగా సమర్పించాలని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్‌ సంస్థల్లో సుమారు 16,900 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) విభాగాల్లో పని చేస్తున్నారని ట్రాన్స్‌కో ఇప్పటికే ప్రాథమికంగా నిర్థారించింది. టైపిస్టులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, డ్రైవర్లు తదితర కేటగిరీల్లో మరికొంత మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ సంబంధించిన బయోడేటా, నివాస ధ్రువీకరణ, స్వీయ ధ్రువీకరణ పత్రాలు, ఔట్‌ సోర్సింగ్‌ ఒప్పందం, అనుభవం తదితర వివరాలతో నిర్దేశించిన ఫార్మాట్లలో సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను రూపొందించనున్నారు. ఈ మేరకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఖ్యపై ఈనెల 28 తర్వాత స్పష్టత రానుంది.

మార్గదర్శకాలను ప్రతిపాదించిన యూనియన్లు
ట్రాన్స్‌కో యాజమాన్యం సూచన మేరకు ఇప్పటికే కొన్ని ట్రేడ్‌ యూనియన్లు స్వయంగా క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదిం చాయి. విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిబంధనలతో సంబంధం లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులంద రిని క్రమబద్ధీకరించాలని దాదాపు అన్ని యూనియన్లు కోరుకున్నాయి. మరోవైపు క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను మార్చి 31లోగా జారీ చేస్తామని, మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. దీంతో గడువులోగా మార్గదర్శకాలు సిద్ధం అవుతాయా, లేదా అనే అంశంపై ట్రేడ్‌ యూనియన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు