సైబర్‌ షటిల్‌

6 Mar, 2018 02:32 IST|Sakshi

ఈ బస్సు సేవలు ఐటీ ఉద్యోగులందరికీ...

షీ షటిల్‌ మాదిరిగానే మూడు మార్గాల్లో మినీ బస్సులు

కాలుష్యం, ట్రాఫిక్‌ తగ్గించేందుకే: సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ

సాక్షి, హైదరాబాద్‌/రాయదుర్గం: ఐటీ కారిడార్‌లో ఉద్యోగుల సురక్షిత ప్రయాణంతో పాటు కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు తగ్గించడంపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. ఇన్నాళ్లు పోలీసులు ఐటీ మహిళా ఉద్యోగుల కోసం సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ)తో కలసి షీ షటిల్‌ సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పోలీసులు.. ఎస్‌సీఎస్‌సీ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) సహకారంతో ‘సైబర్‌ షటిల్‌’పేరుతో ఐటీ ఉద్యోగులందరూ ఉచితంగా ప్రయాణం చేసేలా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ మేరకు మూడు మినీ బస్సులను నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని వైఎస్‌ఆర్‌ భవన్‌ వద్ద టీఎస్‌ఐఐసీ సైబరాబాద్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌తో కలసి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సైబరాబాద్‌ పరిధిలోని ఐటీ కారిడార్‌ మహిళా ఉద్యోగుల కోసం నడిపే షీ షటిల్‌ బస్సులను రాచకొండ పరిధిలోనే కాకుండా వైజాగ్‌లో కూడా ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం ఎస్‌సీఎస్‌సీ సహకారంతో మూడు మార్గాల్లో ఉచితంగా మినీ బస్సు సేవలను అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సేవలను రాబోయే రెండేళ్లలో 15 నుంచి 30 వరకు పెంచుతామన్నారు.  

త్వరలో మరిన్ని బస్సులు
ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి భరణికుమార్‌ అరోల్‌ మాట్లాడుతూ షీ షటిల్‌ ద్వారా అయిదు బస్సులు మహిళల కోసం, టీఎస్‌ఐఐసీ ద్వారా కొత్తగా నాలుగు బస్సులను ఐటీ కారి డార్‌లో నడుపుతున్నామన్నారు.  బస్సుల వినియోగానికి నెలకు రూ.1.25 లక్షలు అవుతోందని, స్పాన్సర్ల సహకారంతో ఈ సేవలను అందిస్తున్నామని తెలిపారు. టీఎస్‌ఐఐసీ సైబరాబాద్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ కేవలం ఐటీ కారిడార్‌లోనే నడిపేందుకు  సర్వీసులు ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ జయరామ్, గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ నర్సింగ్‌రావు, ఎస్‌సీఎస్‌సీ సభ్యులు కృష్ణారావు, టీఎస్‌ఐఐసీ అధికారులు, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇవే మార్గాలు...(సేవ సమయాలు ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి రాత్రి 9)  
రూట్‌ ఏ : మాదాపూర్‌ ఠాణా, ఇమేజ్‌ హాస్పిటల్, సైబర్‌ టవర్స్, మైండ్‌స్పేస్‌ జంక్షన్, వీ పార్క్, ఐలాబ్స్‌/ఇనార్బిట్, మాదాపూర్‌ ఠాణా
రూట్‌ బీ: హైటెక్‌ ఎంఎంటీఎస్, సైబర్‌ టవర్స్, కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్, విప్రో, ఐసీఐసీఐ, వేవ్‌రాక్‌  
రూట్‌ సీ: హఫీజ్‌పేట ఎంఎంటీఎస్, కొత్తగూడ, ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్, గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్, విప్రో, విర్టుస సీఏ,    క్యూ సిటీ

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు