జిల్లాల చట్టానికి సవరణ

8 Oct, 2016 02:35 IST|Sakshi
జిల్లాల చట్టానికి సవరణ

ఆర్డినెన్స్‌ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
కొత్త జిల్లాల్లో 3,500 పోస్టుల భర్తీకి పచ్చజెండా
సీఎం నేతృత్వంలో కేబినెట్‌ భేటీ
రాష్ట్రంలో బీసీ కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం
కొత్తగా నాలుగు పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు
వచ్చే విద్యాసంవత్సరంలో
119 బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు
మరో 90 మైనారిటీ గురుకుల
పాఠశాలలు ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌
: కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. తెలంగాణ డిస్ట్రిక్ట్స్‌ ఫార్మేషన్‌ యాక్ట్‌ 1974లో ఉన్న నిబంధనను సవరిస్తూ  శుక్రవారం ఈ ఆర్డినెన్స్‌ను వెలువరించింది. అలాగే కొత్త జిల్లాలకు అవసరమైన దాదాపు 3,500 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో అవసరమైన సిబ్బంది నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేబినెట్‌లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను వెల్లడించారు. ముసాయిదాలో ప్రతిపాదించిన 27 జిల్లాల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. కొత్తగా ఎన్ని జిల్లాలు పెరుగుతాయనేది తుది నోటిఫికేషన్‌ తర్వాతే తెలుస్తుందన్నారు.

‘‘జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి 27 జిల్లాలతో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశాం. ఆ తర్వాత కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి లక్షకుపైగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదనంగా జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు వీలుగా గతంలో ఉన్న చట్టాన్ని సవరించాల్సి ఉంది. ఇందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీ స్థాయి అధికారుల నియామకానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచనప్రాయంగా ఆమోదించింది. తుది నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాతే ఐఏఎస్, ఐపీఎస్‌ల సంఖ్యపై స్పష్టత వస్తుంది. కొత్త జిల్లాలకు అవసరమైన కొత్త పోస్టులకు సంబంధించి వివిధ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది’’ అని కడియం వెల్లడించారు. మీడియా సమావేశంలో కడియం వెంట డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జోగు రామన్న ఉన్నారు.

అదనంగా మరో నాలుగు కమిషనరేట్లు
రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీస్‌ కమిషనరేట్లు ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్‌ల జారీకి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కరీంనగర్, రామగుండం, సిద్దిపేట, నిజామాబాద్‌లో కొత్త పోలీస్‌ కమిషనరేట్లు ఏర్పడతాయి. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్లు ఉన్నాయి.

మున్సిపల్‌ బిల్డింగ్‌ ట్రిబ్యునల్‌
మున్సిపల్‌ బిల్డింగ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలిగించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వంటి నగర పాలక సంస్థల్లో ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌కు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ‘నర్మ్‌’ కింద నిర్మాణంలో ఉన్న 24,648 ఇళ్లను పూర్తి చేయాలని, అందుకు హడ్కో నుంచి రుణం తీసుకోవడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో బీసీ కమిషన్‌
రాష్ట్రంలో బీసీ కమిషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్‌ జారీకి అమోదం తెలిపింది. కులాల చేర్పులు, తొలగింపులు, బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేయటంతో పాటు ఈ కమిషన్‌ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేస్తుంది.

119 బీసీ, 90 మైనారిటీ గురుకుల స్కూళ్లు
కేజీ టు పీజీలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 119 బీసీ, 90 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ విద్యార్థులకు 103, మైనారిటీలకు 71, ఎస్టీలకు 50 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రభుత్వం నెలకొల్పింది. ఎస్సీ మహిళలకు ప్రత్యేకంగా 30 రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసింది. మైనారిటీల కోసం నెలకొల్పిన స్కూళ్లకు చక్కటి స్పందన వస్తోంది. ఇది దేశంలోనే ఆదర్శవంతమైన నిర్ణయమని కేంద్ర మంత్రి నఖ్వీ సైతం ప్రశంసించారు. తక్షణమే రూ.100 కోట్లు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారు.

మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలు..
ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అయితే 2014 జూలై నుంచి 2014 అక్టోబర్‌ వరకు ఇది వర్తించలేదు. ఆ వ్యవధికి సైతం వర్తింపజేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన 321 మంది పోలీస్‌ అమర వీరుల కుటుంబాలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం
యాదగిరిగుట్ట, పెద్ద శంకరంపేటలో ఫైర్‌ స్టేషన్ల ఏర్పాటు
వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోకి ఆరు గ్రామాలు. తిప్పాపూర్, సంకెపల్లి, నాంపల్లి, చంద్రగిరి, మారుపాక, శాత్రాజుపల్లి గ్రామాలు అథారిటీ పరిధిలో చేర్చారు
హెటెరో సంస్థకు చెందిన సాయిసింధు ఫౌండేషన్‌ అధ్వర్యంలో బసవతారకం ఆసుపత్రి తరహాలో కేన్సర్‌ ఆసుపత్రి నెలకొల్పేందుకు శేరిలింగంపల్లి మండలం ఖానాపేటలో 15 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు