డాక్టర్‌ @ గంజాయి చాక్లెట్‌!

29 Jan, 2017 11:10 IST|Sakshi
డాక్టర్‌ @ గంజాయి చాక్లెట్‌!

- చాక్లెట్లలో గంజాయి కలిపి విక్రయిస్తున్న న్యూరాలజిస్టు
- అరెస్టు చేసిన పహాడీషరీఫ్‌ పోలీసులు

హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ చదివి రోగులకు సేవలందించాల్సిన వైద్యుడు... అడ్డదారిలో సంపాదనకు అలవాటుపడి యువతను మత్తుమందులకు బానిస చేస్తున్నాడు. చాక్లెట్లలో గంజాయి కలిపి సామాజిక మాధ్యమం ద్వారా తన చీకటి వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకూ విస్తరించాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు ఆ వైద్యుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. రాజధానిలోని పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

యూట్యూబ్‌లో చూసి...
బహదూర్‌పురాకు చెందిన మహ్మద్‌ సుజాత్‌ అలీఖాన్‌ (35) 2006లో దక్కన్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. అప్పటి నుంచి 2014 వరకు నిమ్స్‌లో రీసెర్చ్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశాడు. అనంతరం అక్కడ ఉద్యోగం మానేసిన జిమ్‌లో ఫిట్‌నెస్‌ కన్సల్టెంట్‌గా చేరి.. ఆహారపు అలవాట్లపై సలహాలివ్వడం ప్రారంభించాడు. సరైన సంపాదన లేకపోవడంతో కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. దీంతో చాక్లెట్లలో గంజాయి కలిపి విక్రయించాలని నిర్ణయించుకుని, యూట్యూబ్‌లో దీని తయారీని నేర్చుకున్నాడు.

న్యూరాలజిస్టు అయిన సుజాత్‌కు... ఏ మోతాదులో కలిపితే ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం సులభమయ్యింది. వివిధ మార్గాల ద్వారా వెంటనే గంజాయి తెప్పించుకొని దానిని పొడిగా చేసి... చాక్లెట్‌ మిశ్రమంలో కలపడం ప్రారంభించారు. అలా తయారు చేసిన చాక్లెట్లను విక్రయించడానికి ఇన్‌స్ట్రాగామ్‌ యాప్‌లో ఓ గ్రూప్‌ ఏర్పాటు చేశాడు. ఈ చాక్లెట్‌లో కలిపిన గంజాయి పనితీరును వారికి వివరించాడు. వీటిని ఎక్స్, 2ఎక్స్, 3ఎక్స్‌ బ్రాండ్‌లుగా పేర్కొంటూ ఒక్కోటి రూ.500 నుంచి రూ.1,800 వరకు అమ్మాడు. ఇతర రాష్ట్రాల వారికి కూడా సరఫరా చేస్తూ సులభంగా డబ్బు సంపాదించగలిగాడు.

వలవేసి పట్టిన పోలీసులు
ఈ దందాపై సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు నర్సింగ్‌రావు, నవీన్‌కుమార్, పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి... షాహినగర్‌లోని ఓ కస్టమర్‌కు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా వైద్యుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బైక్‌తో పాటు రూ.12,520 నగదు, 45 గంజాయి చాక్లెట్లు, చాక్లెట్లు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ చాక్లెట్ల కోసం చాక్లెట్‌ కేక్, కోకో పౌడర్, నెయ్యి, నూనె, ప్లాస్టిక్‌ కప్, లేబుల్స్‌ వంటి ముడి సామగ్రి సుజాత్‌ కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ చాక్లెట్లను తిన్నవారు దాదాపు 8 గంటల పాటు మత్తులో జోగుతూ.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. మెదడుపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఇవి కొనుగోలు చేస్తున్న వారిలో ఎక్కువమంది యువతే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు