జీహెచ్‌ఎంసీలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూం

19 May, 2016 18:23 IST|Sakshi

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ఎమర్జెన్సీ కంట్రోల్‌రూంను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఇటీవలి భారీ వర్షాలు, ఈదురుగాలులకు వివిధ విభాగాలు శక్తివంచన లేకుండా పనిచేసినప్పటికీ సమన్వయం లేకపోవడంతో సహాయ చర్యల్లో జాప్యం జరిగిందన్నారు. మరోవైపు ఇలాంటి సమయాల్లో ఎవరికి ఫోన్ చేయాలో, ఎవరు పరిష్కరిస్తారో తెలియక ప్రజల్లో అయోమయం ఏర్పడిందని తెలిపారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వైపరీత్యాల సమయంలో 24 గంటలపాటు పనిచేసేలా ఈ ఎమర్జెన్సీ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

బాగా వాడుకలో ఉన్న 100 నంబర్‌నే కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. 100 నంబర్ ఏకకాలంలో 170 ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నంబర్ దొరకని వారు జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ నంబర్ 040-21 11 11 11ను కూడా వినియోగించవచ్చునన్నారు. వీటిద్వారా అందే ఫిర్యాదులను కంట్రోల్‌రూమ్‌లోని ఆయా విభాగాల అధికారులు తక్షణం స్పందించి, చర్యలు చేపడతారన్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు పోలీసు, విద్యుత్, జలమండలి, రెవెన్యూ, 108, ఎన్‌ఆర్‌ఎస్‌సీలు ఇందులో భాగస్వాములుగా ఉంటాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే కంట్రోల్‌రూం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా విచక్షణతో ఫోన్ చేయాలని సూచించారు.


మొబైల్‌యాప్..
ఫోన్ ద్వారా పూర్తిస్థాయి సమాచారం ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు సైతం వినియోగించేలా మోబైల్‌యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. చెట్లు కూలినా, మరేదైన ప్రమాదం జరిగినా సదరు చిత్రాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే.. దాన్ని ఎవరు పంపించారో వారి ఫోన్ నంబర్, ప్రమాదం ఏ ప్రాంతంలో జరిగింది, అక్కడ కు సమీపంలో ఉన్న సహాయక బృందాల వివరాలు తదితరమైనవన్నీ తెలుస్తాయన్నారు. దాంతో, రిసోర్స్‌మ్యాపింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి తక్షణ చర్యలకు వీలుంటుందని చెప్పారు.

మరిన్ని వార్తలు