‘పరీక్ష’ కాలం!

28 Feb, 2016 02:09 IST|Sakshi
‘పరీక్ష’ కాలం!

సమతుల ఆహారం తీసుకోండి
కనీసం 6 గంటల నిద్ర తప్పనిసరి
అతి ఆందోళన ప్రమాదకరం
తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం
ఇది ఒక అవకాశమే... జీవితం కాదు
విద్యార్థులకు నిపుణుల సూచనలు.. సలహాలు

సాక్షి, సిటీబ్యూరో: పరీక్షల సీజన్ మొదలైంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఇంటర్మీడియెట్.. డిగ్రీ... ఆ తర్వాత పదో తరగతి... అనంతరం వివిధ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తరగతులు ముగిశాయి. పునఃశ్చరణ జోరుగా కొనసాగుతోంది. దాదాపు 3 నెలలు ఒకదాని తర్వాత మరొకటి జరిగే పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే విజయం సొంతమవుతుంది. గంటల తరబడి చదివినా.. ఏకాగ్రత తప్పకూడదు. చదువుపైనే మనసు లగ్నం కావాలి. ఇవన్నీ సజావుగా సాగాలంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మలచుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. చదువు పైనే మనసు కేంద్రీకృతం కావాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆందోళనను దరిచేరనీయవద్దని స్పష్టం చేస్తున్నారు.

 తల్లిదండ్రులకు  సూచనలు
‘చద వండి’ అంటూ పదే పదే విద్యార్థులను విసిగించొద్దు. పరీక్షల సమయంలో అతిగా చదివినా... పెద్దగా లాభం ఉండదు. కాకపోతే ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో వారికి తెలియజేయండి. పరీక్షలు ముగిసే వరకు వారికి పనులు చెప్పకపోవడమే మంచిది. విద్యార్థులు ఆందోళనపడుతున్నట్లు గుర్తిస్తే.. వారితో గడిపేందుకు కొంత సమయాన్ని కేటాయించండి. టీవీ చూడడం...  మొదటిపేజీ తరువాయి

సంగీతాన్ని ఆస్వాదించడం... పార్క్‌కు వెంట తీసుకెళ్లడం..వంటి వాటితో మనసుకు ప్రశాంతత  లభిస్తుంది. విద్యార్థి చదువుతున్న చోటనేమీరూ చిన్న చిన్న పనులు చేస్తూ గడిపితే వారికి కొంత విశ్వాసం పెరుగుతుంది. వీలైతే ఫలితాల గురించి కాకుండా.. చదివిన అంశాలను ఏవిధంగా పూర్తి స్థాయిలో పేపర్‌పై పెట్టవచ్చో చూపిస్తే మంచిది. ఇంట్లో నిశ్శబ్దం పాటించాలి. టీవీలు, రేడియోలు కట్టిపడేస్తే అంతరాయం ఉండదు. అంతా మంచే జరుగుతుందని విద్యార్థులకు ధైర్యం చెప్పాలి.

 విద్యార్థులు పాటించాల్సినవి
భవిష్యత్‌కు మేలిమలుపుగా నిలిచే టెన్త్, ఇంటర్  పరీక్షల సమయంలో విద్యార్థులు ఇతర వ్యాపకాలను విడిచిపెట్టాలి. ప్రధానంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌ల నుంచి ఆలోచనలను చదువు వైపు మళ్లించాలి. లేదంటే సమయం వృథా కావడమే కాక.. భావోద్వేగాలకు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. స్నేహితులతో సరదా తిరుగులు వదిలేయండి. పుస్తకాన్నే స్నేహితుడిగా భావించి.. నిత్య నూతనోత్సాహంతో సన్నద్ధం కావాలి. ముఖ్యంగా బృందాలుగా చదవడం ఎంతో సహకరిస్తుంది. పాఠ్యాంశాలపై దగ్గరి స్నేహితులతో కలిసి రోజుకు 2-3 గంటలపాటు చర్చిస్తే.. సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. అంతేగాక సందేహాలు నివృత్తి అవుతాయి.

ఆందోళన దూరమవడమే కాకుండా మన చదువుపై ఓ అంచనాకు రావచ్చు. విరామంలేకుండా అదేపనిగా చదువకూడదు. ఇలా చేయడం వల్ల పాఠ్యాంశాలన్నీ గుర్తుండడం కష్టం. తెల్లవారుజామున పుస్తకం పట్టేందుకు అధిక ప్రాధాన్యంఇవ్వండి. చదవడంలో ఒక పద్ధతిని అవలంబిస్తే మేలు. ఎంతసేపు చదివామన్నది కాకుండా.. ఎంత చదివామన్నది... చదివింది ఎంత గుర్తుందన్నది ముఖ్యం. గుర్తున్న పాఠ్యాంశాలను సమాధాన పత్రాలపై పూర్తి స్థాయిలో రాయడం అవసరం. మన దగ్గర పరీక్షలన్నీ.. రాత పద్ధతిలోనే జరుగుతాయి. ఈ క్రమంలో చదువుతూ రాసే విధానాన్ని విద్యార్థులు అలవర్చుకుంటే.. మతిమరుపు అనే సమస్య దరిచేరదు.

ద్రవాహారం తీసుకోవాలి
పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే వేపుడు పదార్ధాలకు బదులు ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లు లభించే ఆహారం తీసుకోవాలి. తల్లిదండ్రులు సమయానికి ఆహారం అందించాలి. తరచుగా పండ్లు, పళ్ల రసాలు ఇస్తే నీరసం రాదు. ప్రోటీన్లు అధికంగా లభించే పాలు, గుడ్లు, లస్సీ తదితర పదార్థాలు తీసుకునేందుకు మొగ్గు చూపాలి. తద్వారా రోగ నిరోధక శక్తితోపాటు ఏకాగ్రత పెరుగుతుంది. తినే పళ్లెంలో ఎంతగా రంగురంగుల కూరగాయలు ఉంటే.. అంతగా శ రీరానికి మేలు జరుగుతుంది. పరీక్షలంటే  ఒత్తిడి సహజం. దీని నుంచి బయట పడేందుకు ఆల్కహాల్ ని ఆశ్రయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఫలితం ఉండకపోవడమేగాక.. ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. పరీక్షలు పూర్తయ్యే వరకు మాంసాహారం తీసుకోకపోవడమే మంచిది.         - డాక్టర్ రాధ, పోషకాహార నిపుణురాలు

అతి ఆందోళన ప్రమాదకరం
పరీక్షల పేరు చెబితే 30-40 శాతం విద్యార్థులు విపరీతంగా ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్య 8-16 ఏళ్ల వయసు వారిలో అధికంగా ఉంటుంది. అటువంటి వారిలో మిగతా విద్యార్థులతో పోల్చుకుంటే తీవ్ర ఆందోళన వల్ల జ్ఞాపక శక్తి 30-50 శాతం తగ్గుతుంది. సక్రమంగా సమాధానాలు రాయలేరు. పరీక్ష అనేది ఒక అవకాశమే తప్ప..అదే జీవితం కాదని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఉన్న సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టి సారించాలి. ఏకాగ్రత, హార్డ్‌వర్క్ గురించే ఆలోచించాలి. ఫలితాల మాట మనసులోకి రానివ్వద్దు. ఆందోళన మితిమీరితే జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చదువు పేరుతో చాలామంది నిద్రను దూరం చేసుకుంటారు. ఇది పొరపాటు. పరీక్షల సమయంలో కనీసం ఆరేడు గంటలైనా నిద్రకు కేటాయించాలి. చాలామంది రాత్రిళ్లు విడతల వారీగా అలారం పెట్టుకుని.. చదువుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారికి పెద్దగా ఒరిగేదేముండదు. ఒక పని తర్వాత ఒకటి చేస్తే.. నిద్రకు భంగం కలగదు. ఎటువంటి అంతరాయం లేకుండా చదువుకోవచ్చు. - డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, మానసిక వైద్య నిపుణులు

టీవీలు కట్టేయడమే ఉత్తమం
తల్లిదండ్రులు ఎక్కువ సమయం టీవీల ముందు కాలక్షేపం చేస్తే.. విద్యార్థుల దృష్టి దీనిపై పడుతుంది. దీనికి ఉత్తమ పరిష్కారం.. పరీక్షలు ముగిసేంత వరకు ఇంట్లో టీవీలు కట్టేయడమే. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు పరోక్షంగా మేలు జరిగినట్లే. మొబైల్స్‌కు దూరంగా ఉండాలి. పరీక్షలు ముగిసేంత వరకు తల్లిదండ్రులు ఎంతో కొంత త్యాగం చేయాలి.

 లేదంటే తమ పిల్లల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. బయటి ఆహారానికి పుల్‌స్టాప్ పెట్టి.. ఇంటి వంటలే చేసి పెట్టాలి. విద్యార్థులను ప్రోత్సహించకున్నా ఫర్వాలేదు కానీ.. నిరుత్సాహ పర చవద్దు.  - సుబ్రహ్మణ్యం,

 ఇంటర్ విద్యార్థిని తండ్రి, కొండాపూర్
భావోద్వేగాలను వాయిదా వేసుకోండి

సాక్షి,సిటీబ్యూరో:‘ఎలాంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులైనా ప్రణాళిక ప్రకారం చదివితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. భావోద్వేగాలకు అతీతమైన ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం మంచిద’ని ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్ వీరేందర్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేరయ్యే సమయంలో పాటించవలసిన నియమాలను వివరించారు. ఆంగ్లంలో సిక్స్ ‘పీ’స్ (ఆరు ‘పీ’లు) ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందగలరని చెప్పారు. అవి...

 1) ప్రిపేర్ స్టడీ వెదర్: ఇంట్లో ఒక్కో గది ఒక్కో రకమైన అవసరానికి  ఉపయోగపడుతుంది. డ్రాయింగ్ రూమ్‌లో టీవీ.. వంటగదిలో ఆహార పదార్ధాలు... బెడ్‌రూమ్‌లో పడక... మన ఆలోచనలను ప్రభావితం చేస్తా యి. ఇలాంటి వాటికి దూరంగా ఇంట్లోనే ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ స్థలంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల చిత్రాలు, నినాదాలు, సూత్రాలు, సిద్ధాంతాలు గోడలపైన ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు త మ ఆశయాలను, లక్ష్యాలను రాసి పెట్టుకోవాలి.

2) పుల్ స్టడీ టైమ్: రోజులోని 24 గంటల సమయం వివిధ రకాల అవసరాలతో ముడిపడి ఉంటుంది. ఉదయాన్నే టిఫిన్... స్కూల్‌కు వెళ్లడం... మధ్యాహ్నం భోజనం... సాయంత్రం ఆటలు, కాలక్షేపం, రాత్రి నిద్ర వంటి అవసరాలు ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని దైనందిన అవసరాల సమయాన్ని కుదించుకొని స్టడీ అవర్స్‌ను పెంచుకొనే విధంగా ప్లాన్ వేసుకోవాలి. ఉదయం పూట చదివితే బాగుంటుందని కొందరు అంటారు. కానీ మనస్తత్వ విశ్లేషణ ప్రకారం కొందరు రాత్రుళ్లలో చదవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మరికొందరు పగలంతా కష్టపడి చదివి పెందరాళే నిద్రకు ఉపక్రమిస్తారు. విద్యార్థులు తమకు ఇష్టమైన వేళల్లోనే చదవడం మంచిది.

3)పోస్ట్‌పోన్ ఎమోషన్స్: ఇది చాలా ముఖ్యమైనది. పరీక్షల సమయంలో అన్ని రకాల భావోద్వేగాలను వాయిదా వేసుకోవాలి. స్నేహితులతో పోట్లాటలు, వాదోపవాదాలు, తగవులు లేకుండా చూసుకోవాలి. ఇంట్లోని వారు ఒత్తిళ్లకు గురి చేసినా పట్టించుకోకుండా చదువుపై ధ్యాస ఉంచాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచేలా, నిరుత్సాహానికి గురి చేసేలా మాట్లాడకూడదు.

4) ప్రిపేర్ స్టడీ ప్లాన్: రోజులో ఎన్ని సబ్జెక్టులు చదవాలి అనేది ముఖ్యం. రోజుకు 3 సబ్జెక్టుల చొప్పున వారంలో అన్ని సబ్జెక్టులు పూర్తయ్యే విధంగా చదువుకోవాలి. సులభంగా ఉన్నవి ఎక్కువగా చదవడం, కష్టంగా ఉన్నవి తక్కువగా చదవడం మంచిది కాదు. అలా అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కష్టం.

5) ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ : గత 5 ఏళ్లుగా వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. వాటిలోని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

6) ప్రాక్టీస్ సెల్ఫ్ టెస్ట్ : పరీక్షలకు ముందు ఇంట్లోనే మనకు మనం ఒక సెల్ఫ్‌టెస్ట్ పెట్టుకోవాలి. దీని వల్ల భయాందోళనలు తొలగిపోతాయి.

మరిన్ని వార్తలు