పరీక్షలపై పరేషాన్‌!

12 Nov, 2023 03:01 IST|Sakshi

ఎన్నికలనేపథ్యంలో కొనసాగని బోధన

పోలింగ్‌ విధుల్లో నిమగ్నమైన అధికారులు

ఇంకా మొదలవని ప్రశ్నపత్రాల తయారీ

ఈసారి టెన్త్, ఇంటర్‌ పరీక్షల్లో స్వల్ప మార్పులకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి టెన్త్, ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల నిర్వహణపై అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షించారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం 2024 మార్చి, ఏప్రిల్‌లలో ఇంటర్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. ఏప్రిల్‌లో టెన్త్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

అయితే అనేక కారణాల వల్ల టెన్త్, ఇంటర్‌ సిలబస్‌ అనుకున్న మేర పూర్తి కాలేదు. గత మూడు వారాలుగా ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలపై దృష్టి పెట్టింది. పోలింగ్‌ ప్రక్రి­యపై ఎన్నికల కమిషన్‌ అధికారులకు శిక్షణ అందించింది. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన వారు క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో బోధన కుంటుపడుతోంది.

నవంబర్‌ నెలాఖరు వరకూ పోలింగ్‌ విధుల్లోనే అధికారులు ఉండనున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సైతం ఇదే పనిలో నిమగ్నం కానున్నారు. దీంతో డిసెంబర్‌ మొదటి వారం వరకు విద్యాసంస్థల్లో బోధన పూర్తిస్థాయిలో సాగే అవకాశం కనిపించట్లేదని ఇంటర్‌ బోర్డు, టెన్త్‌ పరీక్షల విభాగం భావించాయి.

సిలబస్‌ కాకుండా టెన్త్‌ పరీక్షలెలా?
టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు కాను­న్నారు. ఇందులో 2 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 40 శాతం సిలబస్‌ కూడా పూర్తికాలేదు. పుస్తకాల సరఫరాలో జాప్యం, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్న­తుల అంశం కొంతకాలం కొనసాగడం వల్ల బోధనకు ఆటంకం ఏర్పడింది. దీనికితోడు దసరా తర్వాత నుంచి ఎన్నికల కోలాహలమే నెలకొంది.

వాస్తవానికి జనవరి నాటికి టెన్త్‌ సిలబస్‌ పూర్తవ్వాలి. జనవరి రెండో వారంలో పునశ్చరణ చేపట్టాలి. కానీ ప్రస్తుతం డిసెంబర్‌ మధ్య వరకు బోధనే కొనసాగకపోతే సిలబస్‌ ఎలా పూర్తవుతుందని టీచర్లు ప్రశ్నిస్తు­న్నారు. సిలబస్‌ పూర్తికాకుండా పరీక్షలు పెడితే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలను మరో నెలపాటు వాయిదా వేసే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

ఇంటర్‌లోనూ అదే జాప్యం...
ఇంటర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నవంబర్‌ మొదటి వారం వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆలస్యంగా చేరిన వారికి ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. చాలా చోట్ల ఒక్కో సబ్జెక్టులో కనీసం ఒక్క చాప్టర్‌ కూడా బోధించలేదని అధ్యాపకులు అంటున్నారు.

ఈ ఏడాది ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని భావించారు. కానీ ఇప్పటికీ ఈ ప్రక్రియపై అధ్యాపకులకే శిక్షణ నిర్వహించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాస్తే ప్రైవేటు కాలేజీల విద్యార్థులతో పోటీ పడలేరని ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు అంటున్నారు. ఈ అంశాలపై ఇంటర్‌ బోర్డు అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. పరీక్షల తేదీలను పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. 

ప్రశ్నపత్రాల తయారీలోనూ ఆలస్యం...
అక్టోబర్, నవంబర్‌లలోనే ప్రశ్నపత్రాల కూర్పుపై ఇంటర్, టెన్త్‌ పరీక్షల విభాగాలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టు నుంచి 12 మంది నిపుణులను ఎంపిక చేసుకొని గోప్యంగా ప్రశ్నపత్రాలు తయారు చేయించి వాటిల్లోంచి మూడు సెట్లను ఉన్నతాధి­కారులు ఎంపిక చేస్తే ఆ తర్వాత అవి ప్రింటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ పరీక్షలకు సంబంధించి మార్కుల క్రోడీకరణకు సాంకేతిక ఏర్పాట్లు కూడా డిసెంబర్‌ నాటికి చేపట్టాలి. కానీ ప్రస్తుతం సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండడంతో ప్రశ్నపత్రాలపై ఇప్పటికీ దృష్టి పెట్టలేదని అధికార వర్గాలు అంటున్నాయి. 

మరిన్ని వార్తలు