ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఏకగ్రీవం!

4 Oct, 2016 03:43 IST|Sakshi
ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఏకగ్రీవం!

- నామినేషన్ వేసింది ఆయనొక్కరే  
- ముగిసిన నామినేషన్ల ప్రక్రియ


 హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక జరుగుతున్న ఒక ఎమ్మెల్సీ స్థానం అధికార టీఆర్‌ఎస్ ఖాతాలోనే పడనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమైంది. సోమవారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు స్క్రుటినీ, ఉపసంహరణ గడువు ముగిశాక ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున గెలవడం, అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే.
 
 ఫరీదుద్దీన్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఆయనతో పాటు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనపై నమ్మకముంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఫరీదుద్దీన్ ఈ సందర్భంగా విలేకరులతో అన్నారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు.
 
 బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామి అయ్యేందుకు తనకు అందివచ్చిన అవకాశంగా దీన్ని భావిస్తున్నట్టు చెప్పారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని నాయిని అన్నారు. విపక్షాలు ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నాయని, ఏ ఎన్నికల్లోనూ గెలవలేమని అవి ఆందోళనలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఫరీదుద్దీన్, తాను ఒకే మంత్రివర్గంలో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు