నడిచే హక్కుకోసం పోరు..

10 Jan, 2016 04:44 IST|Sakshi
కాంతిమతి కన్నన్

మెహదీపట్నం సమీపంలోని కరోల్‌బాగ్ కాలనీవాసి కాంతిమతి కన్నన్. పాదచారుల సమస్యలపై కొన్నేళ్లుగా తన గళాన్ని వినిపిస్తున్నారు. ‘ఈ నగరంలో రోజుకి ఒక పాదచారి యాక్సిడెంట్‌లో చనిపోతున్నారని మీకు తెలుసా?’ అంటూ ప్రశ్నిస్తారామె. పాదచారుల హక్కుల పట్ల పాలకులు, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నంత కాలం ఈ తరహా సంఘటనలు పెరుగుతూనే ఉంటాయన్నారు. జనాభాలో 70 శాతం మంది ఇప్పటికీ సొంత వాహన సౌకర్యం లేనివారే. మరి వీరంతా నడవడానికి సరైన దారేది? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెదికే ప్రయత్నం చేస్తున్నారు.

నగర రోడ్లను సర్వే చేశారు. పేరుకి రాష్ట్ర రాజధాని నగరమే అయినా హైదరాబాద్‌లో ఎక్కడా పాదాచారులకు మార్గమే లేదని, అరకొరగా ఉన్న ఫుట్‌పాత్‌లు అక్రమ పార్కింగ్‌లు, చెత్తకుండీలు, చిరు వ్యాపారాలు, చిన్న చిన్న గుళ్లు, మందిరాలతో నిండిపోయాయని గుర్తించారు. వీటన్నింటినీ ఫొటోలు, వీడియోలు తీశారు. వీటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన పరిధిలో తోచిన పరిష్కార మార్గాలు కూడా సూచించారు. చేస్తున్న ఉద్యోగాన్ని, వేలల్లో నెలవారీ జీతాన్ని వదిలేశారు. ‘రైట్ 2 వాక్ ఫౌండేషన్’ను సంస్థను ప్రారంభించారు. పూర్తి సమయాన్ని పాదచారుల హక్కులు, ఫుట్‌పాత్‌ల పరిరక్షణకు ఉద్యమించారు.

పాదచారుల సమస్యలపై హైకోర్టులో పిల్ వేశారు. సీఎన్‌ఎన్, ఐబీఎన్ చానెల్‌లో సిటిజన్ రిపోర్టర్‌గా చేసి సమస్య తీవ్రతను వెలుగులోకి తెచ్చారు. 20 వేల మంది పాదచారుల నుంచి ఉద్యమానికి మద్దతుగా సంతకాలు సేకరించారు. ‘చాలా మంది ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఈ సమస్యపై స్పందించారు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. అయితే ఇంకా చాలా జరగాలి.  పాదచారుల హక్కులపై ప్రతి ఒక్కరిలో చైతన్యం పెరగాలి. పూర్తిస్థాయి పెడస్ట్రియన్ (పాదచారులు) పాలసీ రూపొందాలి. వీటికోసం పోరాడుతూనే ఉంటా’నంటున్నారు కాంతిమతి. ఇదే విషయంపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
- ఎస్.సత్యబాబు

>
మరిన్ని వార్తలు