ఖైరతాబాద్‌ ఏజీ ఆఫీసులో అగ్నిప్రమాదం

4 May, 2016 03:27 IST|Sakshi
ఖైరతాబాద్‌ ఏజీ ఆఫీసులో అగ్నిప్రమాదం

* ఆడిట్ విభాగంలో మంటలు
* కాలిపోయిన లాకర్లు, బీరువాలు, పత్రాలు

ఖైరతాబాద్: సైఫాబాద్‌లోని ఏజీ ఆఫీసులో సోమవారం అర్దరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో డి బాక్ల్ 3వ అంతస్తులోని ప్రిన్సిపల్ డెరైక్టర్ సెంట్రల్ (ఆడిట్) కార్యాలయ విభాగం కాలిపోయింది.  అక్కడున్న హై సెక్యూర్డ్ లాకర్లు, బీరువాలు, కంప్యూటర్లు, టేబుళ్లపై ఉన్న డాక్యుమెంట్లు పూర్తిగా తగలబడిపోయాయి. వివరాలు... సోమవారం అర్దరాత్రి తర్వాత ఏజీ ఆఫీసు ప్రధాన గేటు ముందు ఉన్న డి బ్లాక్ 3వ అంతస్తు నుంచి మంటలు, పొగలు వచ్చాయి.

గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఏజీ ఆఫీసు ఉన్నతాధికారులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  1.30కి అసెంబ్లీ నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి ల్యాడర్ సాయంతో 3వ అంతస్తు పైకి ఎక్కి మంటలను ఆర్పేందుకు యత్నించినా ఫలితంలేకపోయింది. దీంతో గౌలిగూడ, సికింద్రాబాద్‌ల నుంచి ఫైరింజిన్లుతో పాటు ప్రత్యేకంగా బ్రౌజర్ ఫైర్ ఇంజిన్‌ను రప్పించారు. బ్రౌజర్ సాయంతో నేరుగా కిటికీల వద్దకు వెళ్లి అద్దాలు పగులగొట్టి మంటలు ఆర్పేందుకు యత్నించారు. మరోవైపు కార్యాలయ గదుల్లోకి వెళ్లి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు.  పూర్తిగా పొగ కమ్ముకోవడం, మరో వైపు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చీకట్లోనే సహాయక చర్యలు చేపట్టారు. అయినా ఒకపట్టాన మంటలు అదుపులోకి రాలేదు.
 
అతికష్టం మీద అదుపులోకి...
మొత్తం 8 ఫైరింజిన్లలో నీరు చల్లి అతికష్టం మీద ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం 12.30కి  మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఆఫీసులోని లాకర్లు, బీరువాలు, కంప్యూటర్లు, ముఖ్యమైన పత్రాలు కాలిపోయాయి.   సహాయక చర్యలను  సిటీ డీఎఫ్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీఎఫ్‌ఓ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఓ తుకారం, ముస్తఫాలు పర్యవేక్షించారు. కాగా, అగ్నిప్రమాదంపై  మంగళవారం సాయంత్రం ఏజీ ఆఫీసు డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎల్.కృష్ణన్ సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్  ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
 
ఫైర్‌సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా...
ఏజీ ఆఫీసులో అగ్నిప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదం ఎలా జరిగిందో అంటుబట్టడంలేదు. అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్‌లోనే ప్రమాదం జరిగి ఉంటుందని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు