Sakshi News home page

కవిత వ్యాఖ్యలపై వామపక్షాల ఫైర్

Published Tue, May 3 2016 3:23 AM

కవిత వ్యాఖ్యలపై వామపక్షాల ఫైర్ - Sakshi

♦ కవిత రాజకీయ పరిపక్వత సాధించాలి: చాడ
♦ టీఆర్‌ఎస్ నేతలు చౌకబారు మాటలు ఆపాలి: తమ్మినేని
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమ్యూనిస్టుల అవసరం లేదన్న టీఆర్‌ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యలపై వామపక్షాలు మండిపడ్డాయి. కవిత రాజకీయ పరిపక్వత సాధించాలని ఆకాంక్షిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల అవసరం లేదన్న కవిత వ్యాఖ్యలను చదివి విస్మయానికి గురైనట్లు తెలిపారు. విప్లవం రావాలని, సమసమాజం కావాలని కమ్యూనిస్టులు కోరుకుంటున్నారని, అయితే సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆ పని పూర్తి చేశారని మేడే ఉత్సవాల్లో కవిత అన్నారు.

దీనిపై స్పందించిన చాడ.. ‘సమ్మె హక్కును హరించడం, ప్రజాస్వామ్య విలువలను మంటగలపడం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం విప్లవ లక్ష్యం కాదు’ అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంత మాత్రాన దారిద్య్రం, ఆకలిచావులు, దోపిడీ ఆగలేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు చౌకబారు మాటలు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. కేసీఆర్ అతిపెద్ద కమ్యూనిస్టయితే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని, ఈఎస్‌ఐ, పీఎఫ్, పెన్షన్లను కార్మికులందరికీ ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు.  కవిత వ్యాఖ్యలపై న్యూడెమోక్రసీ (చంద్రన్న) రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు ఖండించారు.

Advertisement
Advertisement