ఏటీఎం సెంటర్‌లో కాల్పులు

20 May, 2015 23:10 IST|Sakshi

హైదరాబాద్: డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన యువతిని ఓ అగంతకుడు రివాల్వర్‌తో బెదిరించి కాల్పులు జరిపాడు. ఆమె వద్ద నుంచి సుమారు 65 వేలు విలువచేసే బంగారు నగలు, ఏటీఎం కార్డు,సెల్‌ఫోన్‌ను దోచుకుని పారిపోయాడు.ఈ సంఘటన నగరంలోని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చివు గోదావరి జిల్లా తాటిపాక ప్రాంతానికి చెందిన శ్రీలలిత మధురానగర్‌లోని దీక్షిసధన్ మహిళా హాస్టల్‌లో ఉంటూ బేగంపేటలోగల సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఉదయం 7.30గంటల సమయంలో డబ్బులు తెచ్చుకునేందుకు యూసుఫ్‌గూడకు వెళ్లే మార్గంలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎంకు వెళ్లింది. ఏటీఎం కార్డు తీస్తుండగా ముఖానికి గుడ్డకట్టుకుని లోపలికి వచ్చిన ఓ అగంతకుడు రివాల్వర్ తీసి ఆమె తలకు పెట్టాడు.

అరవకుండా తాను చెప్పింది చేయాలంటూ బెదిరించాడు. ఒంటిపై ఉన్న నగలు తీసి ఇవ్వాలని అడిగాడు. ముందు ఆమె నిరాకరించడంతో తనవద్ద ఉన్నది డమ్మి రివాల్వర్ అనుకుంటున్నావా అంటూ కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా భయపడ్డ సదరు యువతి మెడలోని చైన్, చేతిరింగు, చెవిదుద్దులు తీసి ఇచ్చింది. సెల్‌ఫోన్‌తోపాటు ఏటీఎం కార్డు, పాస్‌వర్డ్ నంబరు తీసుకుని పారిపోయాడు. జరిగిన సంఘటనతో తీవ్ర భయాందోళకు గురైన లలిత కొద్దిసేపటితరువాత తేరుకుని స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు