జెండా ఆవిష్కరించిన ఆదర్శ మహిళ

16 Aug, 2013 01:36 IST|Sakshi
జెండా ఆవిష్కరించిన ఆదర్శ మహిళ

సాక్షి, హైదరాబాద్: అవయవ దానం చేసి భర్తను బతికించుకున్న ఆదర్శ మహిళ డి. పావని (30)ని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సముచిత రీతిలో గౌరవించింది. ఆస్పత్రి ఆవరణలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆమెతో జాతీయ పతాకాన్ని ఆవిష్కరింప జేశారు. పావని, ఈశ్వరరావులది ప్రేమ వివాహం. వీరికి పాప, బాబు ఉన్నారు. ప్రేమ వివాహం కావడంతో వీరి రెండు కుటుంబాల నుంచీ తీవ్ర అనారోగ్యానికి గురైన ఈశ్వరరావుకు ఏ రకమైన సహాయం అందలేదు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పావని ధైర్యంగా తన లివర్ నుంచి కొంత భాగం తీసి భర్తకు అమర్చవలసిందిగా డాక్టర్లను అభ్యర్థించింది. ఆ ప్రకారం శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించగా ఇద్దరూ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్రాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆమెకు ఈ అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పావనిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. డాక్టర్ జి.వి.రావుతో పాటు పలువురు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు