సమాచార కమిషనర్ల నియామకాలేవీ?

25 Jun, 2017 03:08 IST|Sakshi
సమాచార కమిషనర్ల నియామకాలేవీ?
- ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు
నియామకాలు చేపట్టేలా ఆదేశాలివ్వండి
హైకోర్టులో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పిల్‌
 
సాక్షి, హైదరాబాద్‌: సమాచార కమిషన్‌కు ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్ల నియామకంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఆ నియామకాలు చేపట్టేలా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరు తూ స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి పిల్‌ దాఖలు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం ఈ నెల 27న ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఆర్టీఐ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసి, ప్రధాన సమాచార కమిషనర్, పది మంది కమిషనర్లను నియమించాలని పిటిషనర్‌ పేర్కొన్నారు.

2 రాష్ట్రాలకు సమాచార కమిషన్‌ ఉమ్మడిగానే ఉందని, 2017 ఏప్రిల్‌ వరకు ప్రధాన కమిషనర్‌తో పాటు ఐదుగురు కమిషనర్లు పనిచేస్తూ ఉన్నారని, ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు నలుగురు కమిషనర్ల నియామకా న్ని రద్దు చేసిందని, అదే సమయంలో మిగిలిన ఇద్దరు కూడా పదవీ విరమణ చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు లేరని వివరించారు. 2017 ఏప్రిల్‌ 1 నాటికి కమిషన్‌లో 11,325 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెలా సగటున 900 అప్పీళ్లు దాఖలవుతున్నాయని తెలిపారు. కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకం లేకపోవడం వల్ల సమాచార హక్కు చట్టం లక్ష్యం నెరవేరకుండా పోతోందన్నారు. కమిషనర్ల నియామకం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు