స్నేహితులే కడతేర్చారు

19 Dec, 2013 05:55 IST|Sakshi

=పథకం ప్రకారమే అవాయిస్ హత్య
 =ఏడుగురి అరెస్టు

 
లంగర్‌హౌస్, న్యూస్‌లైన్: లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో గతనెల 26న వెలుగు చూసిన మహ్మద్ అవాయిస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తమను కాదని వేరే పార్టీలో చేరి ఎదుగుతుండం, పాతకక్షల నేపథ్యంలో స్నేహితులు, రౌడీషీటర్‌తో కలిసి అతడిని చంపినట్టు పోలీసులు తేల్చారు. బుధవారం ఏడుగురు నిందితుల అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం...

మల్లేపల్లి నివాసి మహ్మద్ అవాయిస్(26) స్థానిక జిమ్‌లో కోచ్. నవంబర్ 2న కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో 200 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేపడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, నవంబర్ 25వ తేదీ అర్ధరాత్రి అవాయిస్ తన స్నేహితుల్లో ఒకరైన ఫరూ తనతో మాట్లాడాలని మరో స్నేహితుడు ఫయాజ్ ద్వారా నానల్‌నగర్ వద్ద ఉన్న ఓ హోటల్ వద్దకు రప్పించాడు. అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఫరూతో పాటు అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న కొందరు కత్తులతో అవాయిస్‌పై దాడి చేశారు. చికిత్స పొందుతూ అవాయిస్ ఆసుపత్రిలో చనిపోయాడు.
 
రాజకీయంగా ఎదుగుతున్నాడనే...

కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఓ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న ఇద్దరితో కలిసి ఉండే అవాయిస్ కాంగ్రెస్‌లో చేరి మిగతా వారిని కూడా ఆ పార్టీలోకి తీసుకెళ్లి రాకీయంగా ఎదిగాడు. ఇది ఓర్వలేని వేరే పార్టీలోని స్నేహితులు అతడిని బెదిరించి రాజకీయాల నుంచి దూరం ఉంచాలని నానల్‌నగర్ వద్దకు పిలిపించి బెరించారు. అతను వినకపోవడంతో హత్య చేయించారు.
 
పాత కక్షలు కూడా కారణమే...


మృతుడు అవాయిస్‌కు రౌడీషీటర్ లతీఫ్, అబ్బాస్, ఫరూ స్నేహితులు. అబ్బాస్, ఫరూలు నగరంలోని డీజీ కేబుల్ ఛానల్‌లో పని చేస్తున్నారు. మూడు నెలల క్రితం అబ్బాస్,ఫరూల్ మధ్యగొడవ జరిగింది. ఫరూను అబ్బాస్ ఉద్యోగం నుంచి తీయించాడు. అప్పటి నుంచి వీరు రెండు వర్గాలుగా విడిపోయారు. దీనికి తోడు ఆరు నెలల క్రితం చనిపోయిన రౌడీషీటర్ అజ్జు చెల్లిని కాలాఫత్తర్‌లో ఉండే తన స్నేహితుడైన రౌడీషీటర్ మహ్మద్ ఇబ్రహీంకు ఇచ్చి పెళ్లి చేయాలని అవాయిస్ ఆ అమ్మాయి కుటుంబీకులను కోరాడు. ఈ విషయంలో గొడవ జరగడంతో అవాయిస్‌పై ప్రతీకారం తీర్చుకొనేందుకు రౌడీషీటర్‌లు అజ్జు, షమ్రులు తన స్నేహితుడైన రౌడీషీటర్ మహ్మద్ ఫిర్దోజ్‌ను ఆశ్రయించి పథకం పన్నారు. అవాయిస్ స్నేహితుడు ఫరూను అస్త్రంగా వాడుకొని అబ్బాస్, ఫరూల గొడవ విషయమై మాట్లాడదామని పిలిచి చంపేశారు.
 
నిందితుల రిమాండ్....

అవాయిస్ హత్య అనంతరం నిందితులు గుల్బార్గా, బెంగళూరు, ముంబైలకు వెళ్లారు. అక్కడి నుంచి నెల్లూరు రెహ్మతాబాద్‌కు వెళ్లారు. అక్కడి నుంచి మంగళవారం రాత్రి ప్రైవేటు బస్సులో హైదరాబాద్‌కు వస్తుండగా... లంగర్‌హౌస్ పోలీసులు ఇబ్రహీంపట్నం మండలం మంగన్‌పల్లి చౌరస్తాలో బుధవారం తెల్లవారుజామును ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో రౌడీషీటర్ ఫిర్దోజ్(28), రౌడీషీటర్ మహ్మద్ లతీఫ్(32)తో పాటు మెహ్రాజ్ హుస్సేన్(21), ఫరూ(27), కారు డ్రైవర్ మీర్ షమ్రాజ్ అలీ (19)  సయ్యద్ ఎజాజ్(20), ఇబ్రహీంఖాన్ (23)ఉన్నారు.  వీరి నుంచి మూడు కత్తులు, మూడు బైక్‌లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై రౌడీషీట్లు తెరిచినట్లు డీసీపీ తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరికొందరినీ అరెస్టు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో పశ్చిమ మండలం అదనపు డీసీపీ కే ఆర్ నాగరాజు, ఆసిఫ్‌నగర్ ఏసీపీ వినోద్‌కుమార్, లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు