సాగునీరు భారీ లక్ష్యం వైపు వడివడిగా...

1 Jun, 2016 04:26 IST|Sakshi
సాగునీరు భారీ లక్ష్యం వైపు వడివడిగా...

ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టులకు ఏకమొత్తంగా రూ.25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం
 
- 2018-19 నాటికి 25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టే లక్ష్యం
- కాళేశ్వరం, పాలమూరు పనుల పూర్తిపై దృష్టి
- నిధులకు ఢోకా లేకున్నా.. అధికారుల పనితీరుపైనే ఆధారం
- అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణతో ఇబ్బందులు
 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో హక్కుగా ఉన్న నికర, మిగులు జలాల్లో వాటాలను పూర్తిగా వినియోగించుకోవడం, సుమారు రూ.లక్ష కోట్ల ఖర్చుతో కోటి ఎకరాల కొత్త ఆయకట్టును వృద్ధి చేయడమనే ఘనమైన లక్ష్యాలను నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరిచ్చే దిశగా ముందుకు వెళుతోంది. అందులో భాగంగా ఈ ఏడాది బడ్జెట్‌లో ఏకమొత్తంగా 25వేల కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగిరం చేసేందుకు, కొత్త ప్రాజెక్టులను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత శ్రమించాల్సి రానుంది. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత పెంపొందించుకోవడానికి మరింత పాటుపడాల్సి ఉంది.

 ముందున్నది భారీ లక్ష్యం
 రాష్ట్రంలో సాగు యోగ్యమైన పరీవాహక ప్రాంతానికి నీటిని అందించేందుకు 1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. వీటిద్వారా మొత్తంగా 60.741 లక్షల ఎకరాల భూమికి నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా... 8.92 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధిలోకి వచ్చింది. ఇప్పటివరకు 49,281.72 కోట్లు ఖర్చు చేయగా... మూడు ప్రాజెక్టులు పూర్తయ్యాయి, మరో 14 పాక్షికంగా పూర్తయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాత ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులూ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 2014-15లో రూ.5,285.03 కోట్లు, 2015-16లో రూ.7,189.21 కోట్లు వ్యయం చేసింది. అయినా 2.61 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఏడాది నుంచి పనులు వేగిరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సర్కారు ముందు భారీ లక్ష్యాలున్నాయి.

2019 జూన్ నాటికి 25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది జూలై, ఆగస్టు నాటికి 6.36 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. ఇందులో పూర్తి చేయాల్సిన సింగూరు, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, కిన్నెరసాని, చౌట్‌పల్లి హన్మంతరెడ్డి, పాలెంవాగు, భక్త రామదాస ప్రాజెక్టుల పరిధిలో 1,23,454 ఎకరాలకు... పాక్షికంగా పూర్తి చేయాల్సిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఏఎమ్మార్పీ, దేవాదుల, ఎస్సారెస్పీ-2, వరద కాలువ, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల పరిధిలో మరో 5.12 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది.

 పాలమూరు, కాళేశ్వరంపైనే అందరి దృష్టి
 రూ.83 వేల కోట్ల భారీ వ్యయంతో 18 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు చేపట్టిన కాళేశ్వరం, 12.36 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు రూ.35,200 కోట్లతో చేపట్టిన పాలమూరు, 3 లక్షల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో రూ.6,600 కోట్లతో చేపట్టిన డిండి ప్రాజెక్టులపైనే అందరి చూపు ఉంది. వచ్చే ఏడాది జూన్-జూలై నాటికి కాళేశ్వరం కింద మల్లన్నసాగర్ వరకు ఉన్న ఆయకట్టుకైనా నీటిని ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పాలమూరు ప్రాజెక్టును సైతం వచ్చే మూడేళ్లలో కర్వెన రిజర్వాయర్ వరకు పూర్తి చేయాలని నిర్ణయించిం ది. అయితే ఈ ప్రాజెక్టుల ప రిధిలో భూసేకరణ అడ్డంకిగా మారింది. ఇప్పటికే మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఆందోళన చేస్తున్నారు. భూసేకరణ జరగక పాలమూరు పనులు ముందుకు సాగడం లేదు. డిండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఏడాది కావస్తున్నా డీపీఆర్‌లే సిద్ధం కాలేదు. ఇక వీటితో పాటే రీడిజైనింగ్ చేసిన దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, తుపాకుల గూడెం, సీతారామ, భక్త రామదాస ప్రాజెక్టుల సర్వేలు జరిగినా... అనేక సాంకేతిక అంశాలు ఓ కొలిక్కి రావాల్సి ఉండటం, ఇంతవరకు టెండర్లు పిలవకపోవడం సైతం లక్ష్యాలను నీరుగారుస్తాయేమోన్న సందేహాలు కలిగిస్తున్నాయి.

 కేంద్ర సాయంపై భారీ ఆశలు
 రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేంద్ర పథకాల కింద ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్రంలోని దేవాదుల, నిజాంసాగర్ ఆధునీకరణ, ఎస్సారెస్పీ వరద కాల్వ, కొమురం భీమ్, మోడికుంటవాగు తదితర పదకొండు ప్రాజెక్టులను ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) పరిధిలోకి తీసుకువచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు ఇస్తుందన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఆయా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏఐబీపీ గ్రాంటు కింద రూ.1,155 కోట్లు, నాబార్డు కింద రూ.2,825 కోట్లు రుణం ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. దీంతోపాటు మిషన్ కాకతీయకు ట్రిపుల్ ఆర్ కింద నిధులివ్వాలని విన్నవిస్తోంది. దీనిపై ఎలాంటి సహకారం అందుతుందన్నది వేచి చూడాలి.

 అంతర్రాష్ట్ర వివాదాలతో ఇబ్బందులు
 పొరుగు రాష్ట్రాలతో ఎంత సఖ్యత కోరుతున్నా.. ఆ రాష్ట్రాల నుంచి చొరవ లేని కారణంగా వివాదాలకు ముగింపు ఉండటం లేదు. ముఖ్యంగా ఏపీతో ఆర్డీఎస్ ఆధునీకరణ, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల వంటి విషయాల్లో విభేదాలు నెలకొన్నాయి. వీటి పరిష్కారం కోసం టీఆర్‌ఎస్ సర్కారు ప్రయత్నిస్తున్నా... ఏపీ నుంచి తగిన స్పందన లేకపోవడం అశనిపాతంలా మారింది. ఇక డిజైన్ మారిన ప్రాణహిత, కాళేశ్వరం, ఛనాఖా-కొరట బ్యారేజీలపై మహారాష్ట్రతో చర్చలు.. ఆర్డీఎస్, నారాయణపూర్ జలాలపై కర్ణాటకతో చర్చలు ఫలప్రదమవడం రాష్ట్రానికి పెద్ద ఊరట.

>
మరిన్ని వార్తలు