రికార్డుస్థాయి సేకరణకు ప్రా‘ధాన్యం’

6 Apr, 2017 03:28 IST|Sakshi
రికార్డుస్థాయి సేకరణకు ప్రా‘ధాన్యం’

- రబీలో 37 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు
- 3 వేలకుపైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- పౌర సరఫరాల శాఖ కసరత్తు


సాక్షి, హైదరాబాద్‌: యాసంగి(రబీ)లో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ సారి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది (2015–16) రబీ సీజన్‌లో 1,286 కొనుగోలు కేంద్రాల ద్వారా 8.42 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈసారి నాలుగింతలు దిగుబడి పెరగనుందని అంచనా వేస్తున్న అధికారులు 3,076 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ ద్వారా 1,101, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ద్వారా 1,771, డీసీఎంఎస్, ఐటీడీఏల ఆధ్వర్యంలో 204 మొత్తంగా 3,076 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ కేంద్రాల ద్వారా ఈ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆ శాఖ అధికార వర్గాలు చెప్పాయి. ఇందులో ఏప్రిల్‌లో 11.35 లక్షల టన్నులు, మేలో 18.92 లక్షల టన్నులు, జూన్‌లో 7.57 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుబాటులో ఉన్న గోదాములను దృష్టిలో పెట్టకుని 500 నుంచి 1,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ఐదు కిలోమీటర్లకు ఒక కొనుగోలు కేంద్రం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మే, జూన్‌లలో రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైన ప్రతి చోటా ధాన్యం నిల్వ కోసం పాఠశాలలను ఉపయోగించుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

వచ్చే వారం నుంచి కొనుగోళ్లు: కమిషనర్‌ సి.వి.ఆనంద్‌
యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియను వచ్చేవారం నుంచే చేపట్టనున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సి.వి.ఆనంద్‌ తెలిపారు. ధాన్యం సేకరణ ఏర్పాట్లపై ఆయన మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. వచ్చే వారం నుంచే ధాన్యం సేకరించేందుకు ఏర్పాట్లు చేశామని, ధాన్యం దిగుబడిని పరిగణనలోకి తీసుకుని జిల్లాలవారీగా గన్నీ సంచులు కేటాయించామని తెలిపారు. మొత్తంగా 9.40 కోట్ల గన్నీ సంచులు అవసరం అవుతాయని అంచనాకు వచ్చామన్నారు.

ధాన్యం విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరను తప్పనిసరిగా చెల్లించాలని, దళారుల ప్రమేయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1,470, ఏ–గ్రేడ్‌ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1,510కి తగ్గకుండా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రబీ కొనుగోళ్ల ప్రారంభం నాటికి 10 లక్షల టన్నుల గోదాముల స్థలాన్ని ఎఫ్‌సీఐ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని సి.వి.ఆనంద్‌ పేర్కొన్నారు.

ధాన్యం సేకరణకు కమిటీలు
కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా స్థాయిలో ధాన్యం సేకరణ కమిటీలను ఏర్పాటు చేయ నున్నారు. ఈ కమిటీలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, రవాణా, డీఆర్‌ డీఏ, ఐటీడీఏ, ఎఫ్‌సీఐ, ఎస్‌డబ్ల్యూసీ, సీడ బ్ల్యూసీ విభాగాల జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. కొనుగోలు కేం ద్రాలు, ధాన్యం సేకరణ, రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అదే మాదిరిగా ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు