‘గుట్కా’య స్వాహా!

17 Aug, 2016 03:38 IST|Sakshi
‘గుట్కా’య స్వాహా!

నగరంలో రోజుకు వంద కోట్ల దందా
నిషేధం ఉన్నా యథేచ్ఛగా ఉత్పత్తి, అమ్మకం.. మామూళ్ల మత్తులో అధికారులు

పేరుకే నిషేధం.. అంతా బహిరంగం..! నగరంలో ఏ మూలకు వెళ్లినా.. ఏ గల్లీలోకి తొంగి చూసినా గుట్టలుగుట్టలుగా గుట్కా ప్యాకెట్లు..!! ఆర్‌ఆర్ పాన్ మసాలా, 24 క్యారెట్స్ గుట్కా, సాగర్ గుట్కా, సూరజ్ జర్దా, అంబర్ ఖైనీ.. ఒక్కటా రెండా.. జనం ప్రాణాలను నమిలేస్తున్న ఇలాంటి అనేక బ్రాండ్లు అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్నిచోట్లా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. పాన్‌షాపుల నుంచి అనేక దుకాణాల వరకు వీటి వ్యాపారం మూడు గుట్కాలు ఆరు పాన్ మసాలాలుగా సాగుతోంది. ఈ అక్రమ దందా విలువెంతో తెలుసా..? రోజుకు ఏకంగా రూ.100 కోట్లు!  ఇది ఒక్క హైదరాబాద్‌లోనే...! మరి నిషేధం ఉన్న ఈ గుట్కాలు, జర్దాలు బహిరంగంగా అమ్ముతుంటే, వాటిని నివాసాల మధ్యే టన్నులు టన్నులుగా తయారు చేస్తుంటే జీహెచ్‌ఎంసీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇతర అధికారులు ఏం చేస్తున్నారు? మామూలుగానే ‘మామూళ్లు’ పుచ్చుకొని కళ్లు మూసుకుంటున్నారు. ఫలితంగా నగరంలో ఈ అక్రమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
 
 సాక్షి, హైదరాబాద్
 గుట్కా దందాకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ప్రతిరోజూ రూ.100 కోట్ల విలువైన చీకటి వ్యాపారం జరుగుతున్న తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ దందాపై ‘సాక్షి’ బృందం చేసిన పరిశీలనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. నగరం నడిబొడ్డున, నివాసాల మధ్యే గుట్కా కార్ఖానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా టన్నుల కొద్దీ పొగాకు పదార్థాలు తయారు చేయడం, ఆ ఉత్పత్తులు వందల సంఖ్యలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారులకు, అక్కడ్నుంచి వేలల్లో ఉన్న రిటైల్ వ్యాపారులకు చేరుతున్నట్టు పరిశీలనలో స్పష్టమైంది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం గుట్కా మసాలా తయారీ, నిల్వ, సరఫరా, అమ్మకాలు నిషేధం. పొగాకు, నికోటిన్, ఖైనీ, ఖారా వంటి ఉత్పత్తులనూ ప్రభుత్వం నిషేధించింది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న వీటన్నింటినీ నిషేధిస్తూ 2009లో వైఎస్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కానీ చట్టాలు, ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో నిత్యం వంద కోట్ల వ్యాపారం జరుగుతోంది. గుట్కా వ్యాపారంపై సుపరిపాలన వేదిక ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం పలు వివరాలు కోరింది. తెలంగాణలో 2014-15లో గుట్కా వ్యాపారంపై 265 కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దీని తయారీ, వ్యాపారాన్ని అరికట్టేందుకు తమ వద్ద సిబ్బంది, హెల్త్ అధికారులు లేరంటూ సర్కారు చేతులెత్తేయడం గమనార్హం.

గుట్కా డెన్‌లు ఇక్కడే..
నగరంలో బండ్లగూడ, జల్‌పల్లి, తలాబ్‌కట్టా, ఈదీ బజార్, కాటేదాన్, శివరాంపల్లి ప్రాంతాలు గుట్కా తయారీ, నిల్వకు కేరాఫ్‌గా మారాయి. ఆయా ప్రాంతాల్లో గుట్కా తయారీ కేంద్రాలు చిన్నతరహా పరిశ్రమలను తలపిస్తున్నాయి. ప్రధానంగా బండ్లగూడ వద్ద జహంగీర్‌బాద్‌లో ఇళ్ల మధ్య చుట్టూ ప్రహరీతో అర ఎకరంలో విస్తరించిన  పరిశ్రమలో ఆర్‌ఆర్ గుట్కా(ఆర్‌ఆర్ పాన్ మసాలా)తయారీ యథేచ్ఛగా సాగుతోంది. ఇక జల్‌పల్లిలో సాగర్ గుట్కా ఫ్యాక్టరీ, తలాబ్‌కట్టా (ఈదీబజార్)లో ఆర్‌ఆర్ గుట్కా నిల్వ చేసేందుకు రెండు పెద్ద గోదాములు ఉన్నాయి. కాటేదాన్‌లో సాగ ర్ గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది.

ఎలా రవాణా చేస్తున్నారు..?
గుట్కా తయారీ కేంద్రాల నుంచి  బేగంబజార్‌తోపాటు పొరుగు రాష్ట్రాలకూ నిత్యం రూ.100 కోట్ల విలువైన ఉత్పత్తుల అక్రమ రవాణా జరుగుతోంది. ప్రధానంగా అఫ్జల్‌గంజ్, ఉస్మాన్‌గంజ్, గోషామహల్ ప్రాంతాల్లో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారుల ద్వారా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చేరుతోంది. ఇందుకు ప్రత్యేకంగా ఏజెన్సీలున్నాయి. తయారీ పరిశ్రమల నుంచి హోల్‌సేల్ వ్యాపారులకు, రిటైలర్లకు అక్కడి నుంచి చిన్నచిన్న దుకాణాలకు చేరిపోతోంది. పాన్ డబ్బాల్లో సోంపు, వక్కపొడి ప్యాకెట్లతోపాటు గుట్కా, జర్దాను బహిరంగంగా విక్రయిస్తున్నారు. మరికొన్ని చోట్ల పాన్‌మసాల్లో వినియోగించే కోప్రాను పైన పెట్టి కింది నుంచి గుట్కా ప్యాకెట్లను జననానికి విక్రయిస్తున్నారు.

నిషేధం పేరుతో డబుల్ రేటు..
గుట్కాపై నిషేధం వ్యాపారులకు రెట్టింపు లాభాలు తెచ్చిపెడుతోంది. వినియోగదారుల ఒళ్లుతోపాటు జేబులను సైతం గుల్ల చేస్తోంది. ఉదాహరణకు ఒక్క బాక్స్‌లో 65-70 వరకు ఉండే ఆర్‌ఆర్ గుట్కా ప్యాకెట్లు రూ.165కు కొనుగోలు చేసే రిటైలర్లు.. మొత్తం ప్యాకెట్లను విక్రయిస్తే రూ.300 గిట్టుబాటవుతోంది. అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు రెట్టింపు లాభం అన్నమాట! ఇక రూ.135 విలువ చేసే జర్దా అమ్మితే రూ.300, మరో బ్రాండ్‌కు చెందిన రూ.145 విలువైన గుట్కా డబ్బాను విక్రయిస్తే రూ.300 గిట్టుబాటు అవుతోంది. వీటి తయారీ దారులు హోల్‌సేల్ వ్యాపారులకు 50 శాతం డిస్కౌంట్‌తో సరుకు విక్రయిస్తున్నారు.

దందాకు పెద్దల అండదండ
మహానగరంలో యథేచ్ఛగా గుట్కా తయారీ, అమ్మకాలు జరుగుతున్నాయని అధికారులకు తెలిసినా వారంతా మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వీరేకాదు.. గుట్కా తయారీ, అమ్మకాలకు రాజకీయ నాయకుల అండదండలు కూడా పుష్కలంగా లభిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మచ్చుకు కొన్ని ఇవీ..

♦ నాంపల్లి ప్రాంతంలో ఓ బడా వ్యాపారి పాత నగరంలోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీ అండదండలతో నిత్యం రూ.10 కోట్లు విలువ చేసే గుట్కా విక్రయాలు జరుపుతున్నాడు. ఇతనికి నగరంలోని కిందిస్థాయి పోలీసు అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు అండదండలున్నట్లు సమాచారం
♦ బండ్లగూడాలోని ఆర్‌ఆర్ పాన్ మసాలా, 24 క్యారెట్స్ గుట్కా, 24 క్యారెట్స్ పాన్‌మసాలాలు ఉత్పత్తి చేస్తున్న వ్యాపారికి ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఒక ఎంపీ, పలువురు ఎమ్మెల్యేల అండదండలు మెండుగా ఉన్నట్లు సమాచారం. నగరంలో పలు ఫంక్షన్ హాళ్లు నిర్మించిన ఈ వ్యాపారి పోలీసు శాఖకు ఉచితంగా వాటిని కేటాయిస్తూ వారి మెప్పు పొందుతున్నాడు
 ♦ బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో ఓ వ్యాపారి రూ.కోటి విలువ చేసే జర్దా, అమీ తంబాకులను విక్రయిస్తున్నాడు.
 ♦ బేగంబజార్ కాశ్మీర్ హౌజ్ లేన్‌లోని ఓ బడా భవనంలో అంబర్ ఖైనీ, జర్దాల వ్యాపారం నిత్యం రూ.2 కోట్ల పైమాటే!
 ♦ ఫీల్‌ఖానాలోని రంగాచారి లేన్‌లో ఓ వ్యాపారి నిత్యం రూ.కోటి విలువ చేసే సాగర్‌గుట్కా, సూరజ్ జర్దా విక్రయిస్తున్నాడు. ఫీల్‌ఖానా డీకే మార్కెట్‌లోని మహావీర్ బ్యాంక్ ఎదురుగా ఉన్న భవనంలో నిత్యం రూ.2 కోట్లు విలువచేసే బాబా, హీరా, సితార్, నజర్ గుట్కాలను విక్రయిస్తున్నట్లు సమాచారం
 ♦ బేగంబజార్ స్వస్తిక్ మిర్చీ సమీపంలో నారాయణగూడకు చెందిన ఓ వ్యాపారి నిత్యం రూ.2 కోట్లు విలువచేసే జోడాబైల్, ఇతర కంపెనీల జర్దా విక్రయిస్తున్నాడు
 ♦ షాహినాత్ గంజ్ బేదర్‌వాడీ ప్రాంతంలో ఓ వ్యాపారి పలు కంపెనీలకు చెందిన జర్దాలు,గుట్కాలు పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నాడు
 ♦ఫీల్‌ఖానాకు చెందిన ఓ బడా వ్యాపారి సొంతంగా పాతబస్తీ షంషీర్‌గంజ్‌లో నజర్ గుట్కాను తయారు చేసి బేగంబజార్‌లో అమ్ముతున్నాడు

పాతబస్తీలో గుట్టలుగుట్టలుగా..
 పాతబస్తీలో ఏ పాన్ షాప్‌లో చూసినా గుట్టలుగుట్టలుగా గుట్కా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. ఈ దందా వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక్కడ ఆర్‌ఆర్, గోవా-1000, సాగర్, 24 క్యారెట్, ఆర్‌ఎండీ గుట్కాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాజా ఖైనీ, చైనీ ఖైనీలు కూడా సులభంగా లభ్యమవుతున్నాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో ఆర్‌ఆర్ గుట్కాను పెద్దఎత్తున తయారు చేస్తున్నారు. ఈ గుట్కాను ఈది బజార్, లలితాబాగ్ మహ్మద్‌నగర్, బండ్లగూడ, జల్‌పల్లి ప్రాంతాల్లోని గోడౌన్లలో నిల్వ ఉంచి ఏజెన్సీల ద్వారా మార్కెట్‌లో చలామణి చేస్తున్నారు. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన ఈ గోడౌన్ల నుంచి వెలువడుతున్న వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తయారీ కేంద్రాల నుంచి వెలువడుతున్న ఘాటు వాసనలు ముక్కు పుటాలు అదరగొడుతున్నాయి. కొందరు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు.

మరిన్ని వార్తలు