మూసీకి భారీ వరద

21 Sep, 2016 16:28 IST|Sakshi

నల్లగొండ: ఈ ఫోటోలు చూశారా..  నీళ్లు చూస్తే.. నాగార్జున సాగర్.. శ్రీశైలం డ్యామ్ ని తలపిస్తోంది కదూ.. కానీ.. ఇది మూసీ ప్రాజెక్టు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ లోని మూసీ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టాన్ని చేరింది. దీంతో అధికారులు బుధవారం ప్రాజెక్టు ఎనిమిది ఏడు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

దీంతో మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నగరంలోని వరద మొత్తం వచ్చి మూసీలో చేరుతుండటంతో.. నది మూడింతలు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లగొండ జిల్లా పెద్దరావులపల్లి వద్ద మూసీ నది నీరు రోడ్డుపైకి చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో భట్టుగూడెం-పెద్దరావులపల్లి వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ నదిపై ఉన్న వంతెనలు సరిగ్గా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి-పోచంపల్లి మధ్య వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భువనగిరి, బీబీ నగర్ లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో వైపు భట్టుగూడెం- పెద్దరావులపల్లి వంతెన పై వాహనాల అనుమతి నిరాకరించారు. మూసీ వరదల కారణంగా..  పోచంపల్లికి వెళ్లే దారులన్నీ బంద్ అయ్యాయి.

మూసీ గేట్లు ఎత్తివేత..
నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. గత వారంలో కురిసిన వర్షానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 644 అడుగులకు చేరగా.. రాత్రి నుంచి వస్తున్న భారీ వరదకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టాన్ని దాటేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఏడు ఫీట్ల మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ మేరకు డ్యామ్ ఏఈ రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. కేతుపల్లి  వద్ద మూసీనది కి 33 వేల క్యూసెక్కుల ఇన్ ప్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే స్థాయిలో నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు