‘కేంద్ర మంత్రి వైఖరి విచారకరం.. మహిళల బాధను విస్మరించారు’

15 Dec, 2023 16:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి  స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని తెలిపారు. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇదని అన్నారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను స్మృతీ ఇరానీ వ్యతిరేరించడాన్ని ఆమె తప్పుపట్టారు. 

కేంద్ర మంత్రి వైఖరి నిరుత్సాహపరిచిందని, మహిళల బాధను కేంద్ర మంత్రి విస్మరించారని ‘ఎక్స్‌’లో అసహనం వ్యక్తం చేశారు. రుతుక్రమ పోరాటాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి కొట్టిపారేయడం విచారకరమని, మహిళల బాధలను స్మృతీ ఇరానీ విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. “నెలసరి ఎంపిక కాదు. అది సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళలు అనుభవిస్తున్న బాధను విస్మరించినట్లే. మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోంది. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇది’ అని కవిత తెలిపారు. 

గురువారం జనతాదళ్‌(యూ) సభ్యుడు మనోజ్‌ కుమార్‌ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి..  నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాద అన్నారు. నెలసరికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే.

చదవండి: నెలసరి లీవ్‌ అవసరం లేదు

>
మరిన్ని వార్తలు