నళినిపై సీఎం రేవంత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

15 Dec, 2023 21:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్‌, వైద్య..ఆరోగ్య శాఖలపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ పోలీస్‌ అధికారిణి నళిని అంశాన్ని అధికారుల వద్ద ప్రస్తావించిన ఆయన.. ఆమెకు తిరిగి అదే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 

‘‘ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఓడిపోయాక.. తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారు. అలాంటిది తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని వదులుకున్న నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడం న్యాయమే. ఆమెకు అదే పొజిషన్‌ అప్పజెప్పండి. ఒకవేళ పోలీస్‌ శాఖలో తీసుకునేందుకు రూల్స్‌ అడ్డువస్తే.. మరేయితర డిపార్ట్‌మెంట్‌లోకి అయినా తీసుకోండి’’ అని సీఎం రేవంత్‌, సీఎస్‌.. డీజీపీలను ఆదేశించారు. 


పన్నెండేళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఆమె అనుకూలంగా పని చేశారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారామె.

పారదర్శకంగా నియామకాలు చేపట్టండి
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాలు చేపట్టాలని పోలీస్‌ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత పారద్శకంగా, అవకతవకలకు తావులేకుండా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారాయన. హోంగార్డుల నియామకాలను కూడా చేపట్టాలన్నారు. అలాగే.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన నియామాకాల పై నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ లాగే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు ఉంటుందని, ఉత్తర, దక్షిణ తెలంగాణ లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

టైం టు టైం ఆలోచన చేయండి
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సచివాలయ అధికారుల్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలా వచ్చే ప్రజల కోసం మంత్రుల ఛాంబర్‌లో నిర్దిష్టమైన టైం ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని సూచించారాయన. అలాగే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటివారంలో ఒకట్రెండు రోజులపాటు సభలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే.. అక్కడి ప్రజలు హైదరాబాద్‌ దాకా వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. ప్రతీ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు సభలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కరానికి చోరవ చూపాలని అధికారులకు సూచించారాయన. అలాగే.. ఫిర్యాదుల్ని డిజిటలైజేషన్‌ చేయాలని, ప్రజా వాణికి వస్తున్న స్పందన దృష్ట్యా ఇంకా టేబుల్స్‌ పెంచాలని అధికారులకు చెప్పారు. అవసరం అయితే శిక్షణ లో ఉన్న ఐఎఎస్ ల సేవలను వినియోగించుకోవాలన్నారు. 

>
మరిన్ని వార్తలు