రాజధానిలో హైఅలర్ట్

30 Dec, 2014 02:22 IST|Sakshi
రాజధానిలో హైఅలర్ట్

గ్రేటర్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందనే సమాచారం అందరినీ కలవర పెడుతోంది. నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో అణువణువూ జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతులు చోటు చేసుకోవచ్చనే అనుమానంతో ప్రతి అంగుళమూ తనిఖీ చేస్తున్నారు.
 
ఉగ్రవాద దాడుల సంకేతాలు
పోలీసు యంత్రాంగం అప్రమత్తం
రంగంలోకి బాంబు స్క్వాడ్

లాడ్జీలు, బస్టాండ్లను జల్లెడ పడుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
 సాక్షి, సిటీబ్యూరో: బెంగుళూరులో బాంబు పేలుడు... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల టార్గెట్‌లో గ్రేటర్ సిటీ ఉండడంతో నగరంలో పోలీసులు అణువణువునా జల్లెడ పడుతున్నారు. వాహన తనిఖీలు, కార్డన్‌సెర్చ్‌లు, లాడ్జీలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. దేవాలయాలు, పార్కింగ్ స్థలాల వద్ద 30 బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.

జంట కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల మొదలు డీసీపీల వరకు  నాలుగు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ సిబ్బందిని ఆదేశించారు. అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు. గతంలో జైలు నుంచి విడుదలై న అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టారు.

వెస్ట్‌జోన్ పరిధిలో డీసీపీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కార్డన్‌సెర్చ్ చేపట్టారు. హైఅలర్ట్ నేపథ్యంలో స్టార్ హోటళ్లు, రిసార్టులు, ఫాంహౌస్‌లలో కొత్త సంవత్సర వేడుకల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. నిర్వాహకులు విధిగా పార్టీ వేడుకలు జరిగే ప్రదేశాల్లో మెటల్ డిటెక్టర్‌లు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసు అనుమతులు తీసుకోవడంతో పాటు రాత్రి ఒంటిగంట వరకే కార్యక్రమాలను పరిమితం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. మందుబాబులు అదుపు తప్పితే చర్యలు తప్పవని స్పష్టంచేశారు.
 
టెన్షన్..టెన్షన్
ఆస్ట్రేలియాలో సిడ్నీ కేఫ్‌పై ఉగ్రవాదుల దాడి.. పాకిస్తాన్ పెషావర్‌లోని ఆర్మీ పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు సాగించిన నరమేథం.. భారత్‌పై దాడులు చేస్తామని లష్కర్-ఎ-తోయిబా నేత మసూద్ ప్రకటన.. జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ వస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదుల ముప్పు ఉందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే.

వీటిని కూడా పరిగణనలోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలోని లాడ్జీలు, రైల్వే స్టేషన్‌లు, బస్సు స్టేషన్‌లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కొత్త వ్యక్తులు వస్తే... నిఘా పెట్టాల్సిందిగా అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వివిధ ప్రదేశాలలో భిక్షాటన చేస్తూ ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారి వేలి ముద్రలను సైతం సేకరిస్తున్నారు. ఈ రూపంలో కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ దిశగా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు.
 
అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి
                                                     -కమిషనర్ మహేందర్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అన్ని ప్రాంతాలపై నిఘా పెంచాం. అనుమానిత వ్యక్తులు, వస్తువులు, వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఉగ్రవాద కార్యకలాపాలలో హైదరాబాద్ వాసులు ఎక్కడా పాల్గొనలేదు. బయటి వ్యక్తులే వచ్చి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించారు.

ప్రతిసారి హైదరాబాద్ ప్రజలను ఉగ్రవాదుల పేరుతో అవమానించడం సరికాదు. అయినా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సున్నితమైన నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొంటామనే నమ్మకం ఉంది. దీనిలో భాగంగానే ప్రజలను సైతం భాగస్వాములను చేస్తున్నాం.

మరిన్ని వార్తలు