ఈ ఏడాది కూడా నగరవాసులకు నిరాశే!

6 May, 2017 17:53 IST|Sakshi
జూన్‌లో మెట్రో పరుగులు తీస్తుందా?

హైదరాబాద్‌ : ఈ ఏడాది కూడా నగరవాసులకు నిరాశే. ఎన్నోరోజులుగా ఊరిస్తూ వస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైలు ఈ ఏడాది కూడా పట్టాలు ఎక్కేలా కనిపించడం లేదు. పండుగలు వచ్చి వెళుతున్నాయి కానీ మెట్రో రైలు మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు.  దసరా, దీపావళి అంటు వచ్చే ప్రతి పండగకు ముందు మెట్రోరైల్‌ ప్రారంభిస్తామని లీకులిచ్చిన హైదరాబాద్‌ మెట్రోరైల్ లిమిటెడ్ ...సర్వీసులను ఎప్పుడు ప్రారంభిస్తామనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. అంతేకాకుండా మొదట నాగోలు -మెట్టుగూడల మధ్య రైలును ప్రారంభిస్తామని చెప్పిన హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, తాజాగా మియాపూర్‌-ఎస్‌ఆర్‌ నగర్ మార్గం వైపు దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.

కాగా జూన్‌లో  మియాపూర్‌–ఎస్‌ఆర్‌ నగర్‌(11 కి.మీ) మార్గంలో మెట్రో పరుగులు పెట్టనుందని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకూ హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ కోసం ఎల్‌అండ్‌టీ రూ.12,000 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం రూ.2,100  ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాదిచివరికల్లా మెట్రో రైలు ప్రారంభం అవుతుందని,  అయితే మెట్రో ప్రారంభ తేదీ, ముహూర్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్‌ సమస్య లేదని  ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

17 చోట్ల ఎల్‌అండ్‌టీ మల్టి లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ఈ ఏడాదికే మెట్రో పనులు పూర్తి కావాల్సి ఉన్నా, పార్కింగ్‌, అలైన్‌మెంట్‌లో మార్పులు, స్థల సేకరణతో పాటు ఇతర అంశాల కారణంగా జాప్యం జరిగిందని, 2018 డిసెంబర్‌ కల్లా మెట్రో పనులు పూర్తి అవుతాయని ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. కాగా మెట్రో రైల్‌ సర్వీసులపై కేంద్రం స్పష్టతనిస్తుందా లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అలాగే పాతబస్తీలో మెట్రో పనులపై ఎలాంటి స్పష్టత లేదని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చెపుతోంది.

మరిన్ని వార్తలు