వై-ఫైకి బాలారిష్టాలు

21 Apr, 2015 01:24 IST|Sakshi
వై-ఫైకి బాలారిష్టాలు

సాక్షి, సిటీబ్యూరో:రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ప్రారంభించిన వై-ఫై సర్వీసులకు బాలారిష్టాలు తప్పడం లేదు.   నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, ఈట్‌స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన వై-ఫై హాట్‌స్పాట్ పరికరాల వద్ద ఇంటర్నెట్ సర్వీసులను వినియోగించుకోవాలనుకున్న వారికి నిరాశ తప్పడం లేదు. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలను వినియోగించుకునేందుకు కొన్ని గంటల పాటు ప్రయత్నించి విఫలమైనట్టు పలువురు వినియోగదారులు వాపోయారు.
 
 ఉదయం వ్యాహ్యాళికి వెళ్లేవారు... ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సేదదీరదామనుకున్న వారికి ఈ పరిణామం నిరాశపరుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఐదు రోజులు పూర్తయినప్పటికీ బాలారిష్టాలు అధిగమించకపోవడం గమనార్హం. ఇదే విషయమై వై-ఫై సౌకర్యం ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈట్‌స్ట్రీట్, పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన హాట్‌స్పాట్ పరికరాల్లో స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలిపారు.
 
 దీనికి తోడు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో వీటి పరిధిలో నెట్ వినియోగించుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని హెచ్‌ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. వారి సహకారంతో పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటే హాట్‌స్పాట్ పరికరాల్లో సమస్యలు తలెత్తవని వెల్లడించారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ చుట్టూ 40 వై-ఫై హాట్ స్పాట్ పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో పది మినహా మిగతా చోట్ల ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం లేదని చెప్పారు. ఒక్కో హాట్‌స్పాట్ పరికరం వద్ద ఒకేసారి 500 మంది లాగిన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు.
 
 ఇలా వినియోగించుకోవాలి..
 ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో వై-ఫై ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే నెట్‌వర్క్‌లో క్యూ5 నెట్‌వర్క్‌పై క్లిక్ చేయాలి.
 బ్రౌజర్‌లో మీ వివరాలను, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ తదితర వివరాలు నమోదు చేసి... సబ్‌మిట్ చేయాలి.
 మీ సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా అందే సందేశంలోని నాలుగు అంకెల పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలి. ఆ తరవాత లాగిన్ కావాల్సి ఉంటుంది.
 తొలి అరగంట ఉచితంగా వై-ఫై సేవలు అందుతాయి. ఆ తరువాత వినియోగానికి చార్జీలు తప్పవు.
 అక్కడ నో ఫికర్..
 
 సైబర్‌టవర్స్-మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్ - కొత్తగూడ జంక్షన్, సైబర్ టవర్స్-రహేజా మైండ్‌స్పేస్ సర్కిల్ పరిధిలో గత  ఏడాది అక్టోబర్‌లో వైఫైని అందుబాటులోకి తెచ్చారు. 8 కి.మీ మార్గంలో 17 కేంద్రాల వద్ద వై-ఫై సిగ్నల్స్‌ను అందించే హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో సుమారు 20 వేల మంది నిత్యం 750 మెగాబైట్స్ నిడివిగల వై-ఫై సాంకేతిక సేవలను నిరంతరాయంగా వినియోగించుకుంటున్నారు. అప్పుడప్పుడూ స్వల్ప అంతరాయం ఎదురవుతున్నప్పటికీ సాంకేతిక సమస్యలను ఎయిర్‌టెల్ సంస్థ వెంటనే సరిదిద్దుతోంది. దీంతో వై-ఫై సేవలకు అంతరాయం కలగడంలేదని వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువమంది లాగిన్ అయినపుడు మాత్రం అంతరాయం కలుగుతోందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు