అమానుషంగా వ్యవహరించారు...

26 Mar, 2016 00:46 IST|Sakshi
అమానుషంగా వ్యవహరించారు...

ములాఖత్‌కు వెళ్లిన నేతలతో హెచ్‌సీయూ విద్యార్థుల వెల్లడి
 సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో తాము శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుండగా పోలీసులు అమానుషంగా వ్యవహరించి అక్రమంగా అరెస్టు చేశారని చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు శుక్రవారం ములాఖత్ కోసం వెళ్లిన నేతలతో వాపోయారు. పోలీసులు పథకం ప్రకారమే తమను అరెస్టు చేశారని, ముందుస్తు వ్యూహం అమలు చేశారని పేర్కొన్నట్లుగా ములాఖత్‌కు వెళ్లివచ్చిన నేతలు వెల్లడించారు.
 
   ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు, ప్రముఖ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య విడివిడిగా జైలులో ఉన్న విద్యార్థులు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్, ప్రొఫెసర్ రత్నం, కృశాంక్, లింగస్వామి, అమృతరావు, దుంగ హరీష్‌లతో ములాఖత్ అయ్యారు. హెచ్‌సీయూ ఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. తమను పోలీసులు పలు పోలీస్‌స్టేషన్లలో ఉంచి అమానుషంగా వ్యవహరించారని విద్యార్థులు చెప్పారు. పోలీసుల చర్యల కారణంగా తమ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురయ్యారని, కొందరు ఆస్పత్రి పాలయ్యారని జైలులో ఉన్న అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ములాఖత్‌కు వెళ్లివచ్చిన మౌలానా ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థిని అరుణ తెలిపారు.
 
 ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఖండన
 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శాంతియుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులు, అధ్యాపకులపై పోలీసుల దాడిని, అరెస్టులను అంతర్జాతీయ మానవహక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తీవ్రంగా ఖండించింది. విశ్వవిద్యాలయంలో పోలీసుల మోహరింపుపై, జరిగిన ఘటనలపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావు రాకను తిరస్కరిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై  తెలంగాణ పోలీసులు దాడులు చేయడం అన్యాయమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం న్యాయవిచారణ లేకుండా ఎవరినీ శిక్షించే అధికారం లేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సయ్యద్ ఆకార్  పటేల్ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు