జల గ్రహణం

13 Feb, 2015 23:59 IST|Sakshi
జల గ్రహణం

శివారుల్లో అడుగంటుతున్న భూగర్భ జలాలు {పైవేటు ట్యాంకర్లే గతి
అపార్ట్‌మెంట్లలో పెరుగుతున్న నిర్వహణ వ్యయం
 

నల్లాల వద్ద భారీ క్యూలు. బోర్ల వద్ద జన సమూహాలు. ట్యాంకర్ల చెంత బిందెలతో యుద్ధాలు. గంటల తరబడి ఎదురు చూపులు... ఎక్కడికక్కడ వెక్కిరిస్తున్న బావులు...అడుగంటిన భూగర్భ జలాలు... ఇవీ నగర శివారుల్లో నీటి కష్టాలకు  నిదర్శనాలు. వేసవి ఛాయలు పూర్తిగా కనిపించకముందే నగరంలో ప్ర‘జల’ఘోష మొదలైంది. భవిష్యత్తుపై బెంగను పెంచుతోంది.
 
సిటీబ్యూరో:  రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో వేసవికి ముందే బోరు బావులు బావురుమంటున్నాయి. మహా నగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని 800కు పైగా కాలనీలు, బస్తీల్లో ఫిబ్రవరి మొదటిలోనేప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సుమారు 30 లక్షల మందికి నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. వేలాది నివాసాలు, అపార్ట్‌మెంట్ల వాసులు నీటి ముప్పును తలచుకొని తల్లడిల్లుతున్నారు. జలమండలికి మంచినీటి సరఫరా వ్యవస్థ లేకపోవడం, ఇంకుడు గుంతలు లేక బోరుబావులు వట్టిపోవడంతో నిత్యం ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడక తప్పని దుస్థితి నెలకొంది. అపార్ట్‌మెంట్లలో ఉంటున్న వారు ఒక్కొక్కరు రోజు వారీ వినియోగం, ప్రాంతాన్ని బట్టి నీటి కోసం నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అదనంగా ఖర్చు చేయక తప్పని దుస్థితి నెలకొంది. ప్రగతి నగర్, నిజాంపేట్, బోడుప్పల్, కాప్రా, మల్కాజ్‌గిరి, అల్వాల్, యాప్రాల్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, ఎల్బీనగర్, బండ్లగూడ, గాజులరామారం..అన్నిచోట్లా ఇదే దుస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇంటి అద్దెతో పాటు అందులో సగం మొత్తాన్ని అదనంగా నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తుండడం గమనార్హం. మరోవైపు బస్తీల్లో ట్యాంకర్ల వద్ద అప్పుడే మహిళల ‘పానీ పట్టు’ యుద్ధాలు మొదలయ్యాయి.

జనం అవస్థలకు నిదర్శనాలివీ

 ఉప్పల్‌లో: సర్కిల్‌లోని మూడు డివిజన్‌లలో 2014 జనవరిలో సగటున 8.20 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యం కాగా... 2015 జనవరి లో 12.45 లోతుకు నీటి మట్టాలు పడిపోయాయి. రామంతాపూర్‌లోని వెంకట్‌రెడ్డి నగర్, రాంరెడ్డి నగర్, వివేక్‌నగర్, శ్రీనివాసపురం, గోఖలే నగర్, నెహ్రూ నగర్, ఇందిరానగర్, ప్రగతి నగర్, సాయిచిత్రా నగర్ తదితర బస్తీలు... కాలనీల్లో 1500-2000 అడుగుల వరకు బోరుబావులు తవ్వాల్సి వస్తోంది. ఇటీవల నెహ్రూ నగర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు 1500 అడుగుల లోతుకు బోరు వేసినా నీటి జాడ కనిపించకపోవడం గమనార్హం. స్థానిక అపార్ట్‌మెంట్లలో ఉంటున్న ప్రతి కుటుంబం నెలకు నీటి కోసం రూ.2000-రూ.3000 వరకు వెచ్చించాల్సి వస్తుంది.

హైటెక్ నగరిలో:  మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, కొండాపూర్ తదితర ప్రాంతాలలో బోరుబావుల్లో నీళ్లు అడుగంటాయి. ఈ ప్రాంతాల్లో 1500 అడుగుల లోతుకు బోరు వేసినానీరు రావడం లేదు. కొండాపూర్, శ్రీరాంనగర్ కాలనీ, గచ్చిబౌలి ప్రాంతాలలోని అపార్ట్‌మెంట్లలో ఒక్కో ఫ్లాట్ యజమాని నెలకు రూ.2500 చొప్పున నీటి కోసం వెచ్చించాల్సి వస్తోంది. ఉదాహరణకు మియాపూర్‌లోని ఎస్.ఆర్.ఎస్టేట్స్‌లో 322 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో వెయ్యి మందికిపైగా నివసిస్తున్నారు. జలమండలి కనెక్షన్ ఉన్నప్పటికీ నిత్యం 35 ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ (5000 లీటర్లు)కు రూ.650 వంతున చెల్లిస్తున్నారు. వేసవి కాలం వస్తే ట్యాంకర్‌కు రూ.వెయ్యికిపైగా చెల్లించాల్సి వస్తుంది. ఈ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు అద్దె రూ.9,000 కాగా నిర్వహణ ఖర్చు అందులో 25 శాతం కావడం గమనార్హం.

నిజాంపేట్‌లో: బహుళ అంతస్తుల భవనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిజాంపేట్‌లో ఎక్కడ చూసినా దాహార్తితో జనం అల్లాడుతున్నారు. ఫ్లాట్‌లలో నివసిస్తున్నవారు ఇంటి అద్దె రూ.6 వేలు, నీటి కోసం మరో రూ.3 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల మంజీరనీటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి స్థానిక హైస్కూల్ పక్కనే వాటర్ ట్యాంక్ నిర్మించారు. నీరు మాత్రం స్థానికుల అవసరాలకు సరిపడే స్థాయిలో అందడం లేదు. దీంతో చాలా భవన సముదాయాలు బోర్లపై ఆధార పడుతున్నాయి. ప్రస్తుతం ఆ బోర్లు కూడా నీరిచ్చే స్థితిలో లేవు. దాదాపు రెండు వేల అడుగుల లోతుకు వెళ్లినానీటి జాడ దొరకడం లేదు. పంచాయతీ పరిధిలో దాదాపు 50వేల మంది కష్టాలు పడుతున్నారు. దీంతో భవన యజమానులు, అపార్టుమెంట్ అసోసియేషన్లు, ప్లాట్ల యజమానులు ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.800 నుంచి రూ.1400కు కొనుగోలు చేస్తున్నారు. ప్రగతినగర్ పంచాయతీలోనూ ఇదే దుస్థితి. 15 ఫ్లాట్లు ఉండేఅపార్ట్‌మెంట్‌కు నిత్యం ఐదు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు