తొలి ఉద్యోగం రజినీకే! పీసీసీ చీఫ్‌గా మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడేమో సీఎంగా..

6 Dec, 2023 15:02 IST|Sakshi

తెలంగాణలో తొలి ఉద్యోగం నాకే రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. రేవంత్‌ రెడ్డి సార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. గాంధీ భవన్‌ వెళ్లినప్పుడు ఆయన నాకు ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఆయన నెరవేరుస్తుండడం హ్యాపీగా ఉంది..
:::రజిని

అధికారంలోకి గనుక వస్తే.. అంటూ హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో సర్కార్‌ ఏర్పాటు అవుతున్న తరుణంలో వాటిని నెరవేర్చేందుకు సిద్ధమైపోయింది. రేపు డిసెంబర్‌ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ ప్రమాణం ముఖ్యమంత్రిగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ హామీలు నెరవేర్చడంపైనా ఆయన స్పష్టమైన ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. తొలి ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీతో ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పాలనలో తొలి ఉద్యోగం రజినీ అనే యువతికి దక్కనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని అధికార యంత్రాంగాన్ని రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం అని స్వయంగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడా గ్యారెంటీని నెరవేర్చేందుకు రెడీ అయిపోయారు.  

అక్టోబర్‌ 17వ తేదీన.. నాంపల్లికి చెందిన రజిని అనే ఓ దివ్యాంగురాలు గాంధీభవన్‌కు వెళ్లి రేవంత్‌రెడ్డిని కలిశారు.  రజిని రెండేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతోంది. పీజీ చేసిన తనకు ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రావట్లేదని తన బాధను టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి చెప్పింది. అప్పుడు రేవంత్ రెడ్డి ..  ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం నీకే ఇస్తాం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార సభ ఉంటుంది. ఆ సభకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ వస్తారు. ఆ సభలోనే మొదటి ఉద్యోగం నీకేనమ్మా. ఇది నా గ్యారెంటీ’’ అంటూ రేవంత్‌ ఆమెకు హామీ ఇచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డు మీద స్వయంగా ఆయన రజినీ పేరు రాసి.. కింద సంతకం కూడా చేశారు. 

నెలన్నర తర్వాత.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో తొలి ఉద్యోగం రజినికే దక్కబోతోంది. కానీ, ప్రమాణ స్వీకారమే రెండు రోజులు ముందుగానే జరుగుతోంది. 

>
మరిన్ని వార్తలు