మయన్మార్ దేశస్తులకు భారత్ పాస్‌పోర్టులు

18 Aug, 2015 01:23 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్‌కు చెందిన అక్రమ వలసదారులకు ఇండియన్ పాస్‌పోర్టులు ఇప్పించేందుకు సహకరించిన పాస్‌పోర్టు బ్రోకర్‌తో పాటు ఇద్దరు ఎస్‌బీ సిబ్బందిని సౌత్‌జోన్ టీమ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక ఒరిజినల్ పాస్‌పోర్టు, ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ టి.ప్రభాకర్‌రావు కథనం ప్రకారం...ముంబైకి చెందిన అసన్ జియా అన్సారీ ఉపాధి నిమిత్తం 2003లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. తొలినాళ్లలో ప్రైవేట్ ఉద్యోగం చేసిన అన్సారీ...ఆ తర్వాత డాటా ఎంట్రీ అపరేటింగ్‌ను ఉపాధిగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి అక్రమంగా నగరంలో నివాసముంటున్న మయన్మార్ శరణార్ధులకు ఆధార్ కార్డులు సమకూరుస్తున్న  షాహీన్‌నగర్‌కు మహమ్మద్ జావేద్ (మయన్మార్ వాసి)తో పరిచయం ఏర్పడింది.
 
 దీంతో పాస్‌పోర్టు బ్రోకర్ అవతారమెత్తిన అతను ఎస్‌బీ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్‌తో పరిచయం పెంచుకుని మయన్మార్ దేశస్తులకు ఇండియన్ పాస్‌పోర్టులు  ఇప్పించేవాడు. బషీర్ అహ్మద్‌తో పాటు పాస్‌పోర్టు దరఖాస్తులను పాస్‌పోర్టు వెరిఫికేషన్ సెల్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న సలీమ్‌కు కూడా  భారీ మొత్తంలో లంచాలు ఇచ్చాడు. పాస్‌పోర్టులు పొందినవారు టూరిస్టు వీసాపై సౌదీ అరేబియా వెళ్లినట్టు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎన్.కోఠి రెడ్డి ఆధ్వర్యంలో సౌత్‌జోన్ ఇన్‌స్పెక్టర్ ఠాకూర్ సుఖ్‌దేవ్ సింగ్, ఎస్‌ఐలు జి.మల్లేశ్, కె.వెంకటేశ్వర్లు, ఎస్‌కే జాకీర్ హుస్సేన్, డి.వెంకటేశ్వర్లు ఈ దాడులు నిర్వహించారు.
 

>
మరిన్ని వార్తలు