ఆ పరిహారంపై విచారణ చెల్లదు

7 Jan, 2018 04:04 IST|Sakshi

మల్లన్నసాగర్‌ కేసులో ఆదేశాలిచ్చిన హైకోర్టు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: భూసేకరణ సమయంలో రైతుల అభ్యంత రాల్ని తెలుసుకోకుండా పరిహార చెల్లింపుపై విచారణ చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. సిద్దిపేట జిల్లా వేములఘాట్‌ గ్రామంలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూమి ని సేకరించే ముందు రైతులు, భూసేకరణ వల్ల ప్రభావితుల అభ్యంతరాల్ని తెలుసుకు న్న తర్వాతే పరిహారంపై విచారణ జరపాల ని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తమ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనను ఉల్లంఘించి పరిహార చెల్లింపు విచారణ చేయడం చెల్లదంటూ వేముల ఎల్లవ్వ మరో 22 మంది రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి శుక్రవారం విచారించారు. ‘‘భూసేకరణ చట్టంలోని 19(1) ప్రకారం రైతుల అభ్యంతరాలు తెలుసుకోకుండా పరిహార చెల్లింపు విచారణ చెల్లదు.

రైతులతోపాటు భూసే కరణ వల్ల ప్రభావితమయ్యే వారి అభ్యంతరాల్ని కూడా స్వీకరించాలి’’ అని తెలంగాణ ప్రభుత్వానికి న్యాయమూర్తి తేల్చి చెప్పారు. పిటిషనర్ల భూములే కాకుండా 600 మంది అభ్యంతరాల్ని అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా పరిహార చెల్లింపుపై విచారణ జరుపుతున్నారని పిటిషనర్ల న్యాయవాది వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో కొండం, ముంచిప్ప చెరువులను కలుపుతున్న పనుల్లో ఆచితూచి వ్యవహరించాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి అధికారులకు మరో కేసులో ఆదేశాలు జారీ చేశారు. చెరువుల్ని కలపడం వల్ల రైతుల భూములతోపాటు అటవీ ప్రాంతం కూడా ముంపునకు గురవుతుందంటూ ముగుపాల్‌ మండలం ముంచిప్ప గ్రామస్తులు బానోతు ఈశ్వర్‌ సింగ్, మరో 60 మంది హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విచారణ 18కి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు