20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు

25 Mar, 2018 02:04 IST|Sakshi

ఈ ఏడాదే అందిస్తాం: మండలిలో మంత్రి హరీశ్‌రావు వెల్లడి

10 రోజుల్లో మిడ్‌మానేరు పనులు పూర్తి

ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ అడ్డుపడుతోందని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది చివరికల్లా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఇప్పటివరకు సాగుకు నోచుకోని భూములకు గోదావరి జలాలతో తడిపి ఆకుపచ్చ తెలంగాణ చేయడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్నారు. శనివారం శాసన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన లఘు చర్చలో మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

అంతర్రాష్ట్ర సమస్యలు, నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలు, నీటి వాటాకు తగ్గట్లుగా లేని రిజర్వాయర్లను దృష్టిలో పెట్టుకొనే ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్‌ చేశామని... ఈ దృష్ట్యానే ప్రాజెక్టు వ్యయం పెరిగిందన్నారు. అయితే ప్రాజెక్టును కుట్రపూరితంగా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ కోర్టులు, ట్రిబ్యునళ్లలో కేసులు వేసి అడ్డుకునే యత్నం చేస్తోందని విమర్శించారు.

ఎవరెవరు ఎప్పుడు ఢిల్లీ వెళ్లారు... వారి విమాన టికెట్లకు ఏ క్రెడిట్‌ కార్డు నుంచి డబ్బు డ్రా అయింది... ఢిల్లీలో ఏ లాయర్‌కు ఎంతెంత డబ్బులు ఏ క్రెడిట్‌ కార్డునుంచి వెళ్లిందో తన వద్ద వివరాలున్నాయన్నారు. వాటన్నింటినీ వచ్చే సమావేశాల్లో బయటపెడతానన్నారు. వారి కుట్రలన్నీ ఛేదిస్తూ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను అతితక్కువ కాలంలో సాధించామని చెప్పారు. గోదావరి నీళ్లు పొలాలకు పారితే ఆ నీళ్లలో కాంగ్రెస్‌ కొట్టుకుపోవడం ఖాయమని హరీశ్‌ దుయ్యబట్టారు.

ఆత్మహత్యలు తగ్గాయి...
గతంతో పోలిస్తే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని హరీశ్‌రావు చెప్పారు. రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో 130 శాతం, కర్ణాటకలో 32 శాతానికిపైగా పెరగ్గా, తెలంగాణలో మాత్రం 50 శాతం తగ్గినట్లు కేంద్రం వెల్లడించిందన్నారు. 2017లో ఆత్మహత్యలు పదుల సంఖ్యలో తగ్గాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పూర్తికావడానికి మూడు, నాలుగేళ్లు పడుతుందని హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం కింద 20 ఎత్తిపోతల పథకాలు, 19 పంప్‌హౌస్‌లు, 20 రిజర్వాయర్లు, 1,832 కిలోమీటర్ల కాలువలున్నాయన్నారు.

కాళేశ్వరం కోసం 35 వేల ఎకరాల భూమిని సేకరించామని, ప్రాజెక్టుకు 4,620 మెగావాట్ల విద్యుత్‌ అవసరమన్నారు. ఈ వానాకాలంలోనే మిడ్‌మానేరుకు నీరు తీసుకొస్తామన్నారు. వారం పది రోజుల్లో మిడ్‌మానేరు పనులు పూర్తవుతాయని చెప్పారు. మిడ్‌మానేరు వస్తే ఎస్సారెస్సీ–1, 2 దశలకు 10 లక్షల ఎకరాలకు నీరు రానుందన్నారు. కాళేశ్వరం పూర్తయ్యాక చేపల ఉత్పత్తి, పర్యాటకరంగం అభివృద్ధి తదితరాలు ఊపందుకుంటాయన్నారు. జైపూర్, చెన్నూరు మండలాలకు ఎత్తిపోతలను మంజూరు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు