రూ.3 వేల కోట్లు వస్తున్నాయి: కేసీఆర్

24 Apr, 2016 18:21 IST|Sakshi

హైదరాబాద్: కేంద్ర నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.3 వేల కోట్లు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. క్యాంప్ ఆఫీసులో ఆదివారం సాయంత్రం ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం టెండర్లు పూర్తయినందున ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రభుత్వం ఏడాదికి రూ.25వేల కోట్లు సాగునీటికి కేటాయిస్తుందని, కరువు పీడిత జిల్లా రైతులకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.

ప్రాజెక్టులు పూర్తిచేయడం కోసం ప్రతినెల రూ.2వేల కోట్లు విడదుల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ లో ప్రాజెక్టు పనుల బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. పాలమూరు పంప్ హౌజ్ లు, రిజర్వాయర్లు 24 నెలల్లో పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రెండున్నరేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు