కుక్కలను కాల్చేశారు..

24 Jul, 2016 11:24 IST|Sakshi
కుక్కలను కాల్చేశారు..

హైదరాబాద్ : పైశాచికానందం కోసం విశ్వాసానికి మారుపేరైన శునకాలను కర్కశంగా చంపుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధి లో కొందరు యువకులు కుక్క పిల్లల్ని సజీవ దహనం చేసి.. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసిన విషయం తెలిసిందే. దాన్ని మరువకముందే మరో ఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని ఓ టెక్స్‌టైల్స్ కంపెనీలో ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది.

 హైదరాబాద్‌కు చెందిన గోల్కొండ టెక్స్‌టైల్స్ యజమానులు బాబా, మహమ్మద్ అలీఖాన్  అన్నదమ్ములు. మహమ్మద్ అలీఖాన్  కొడుకు అలీఖాన్ ... అతని స్నేహితులతో కలసి రెండు రోజుల కిందట వీధి కుక్కలను పట్టుకున్నాడు. టెక్స్‌టైల్స్ కంపెనీ గేటు వద్ద ఒక శునకాన్ని, కంపెనీ లోపల మరో మూడు శునకాలను గన్ తో కాల్చి చంపారు. కొన్నింటిని ఓ పెద్దమంట పెట్టి అందులో సజీవ దహనం చేసిన ఆనవాళ్లు కనిపిం చారుు. శునకాలను చంపుతూ వీడియోలు తీసి తర్వాత సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. శనివారం ఈ విషయం గుర్తించిన కేంద్ర మంత్రి మేనకాగాంధీ.. జంతు ప్రేమికురాలు అమలకు సమాచారం ఇవ్వడంతో ఆమె డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న టెక్స్‌టైల్స్ కంపెనీ సిబ్బంది... శునకాలను చంపిన ప్రదేశాల్లో ఇసుక పోసి కప్పెట్టారు. కాగా, దాదాపు ఎనిమిది మంది కలసి శునకాలను చంపినట్లు తెలుస్తోంది.
 
 విచారణ జరిపిన డీఎస్పీ..
 ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి, చేవెళ్ల సీఐ ఉపేందర్, వికారాబాద్ సీఐ రవి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుక్కలను చంపినట్లు ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లు లేవని, విచారణ జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు