30న కృష్ణా బోర్డు కమిటీ భేటీ

23 May, 2017 03:58 IST|Sakshi
30న కృష్ణా బోర్డు కమిటీ భేటీ

- ఇరు రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ లేఖ
- సాగర్, శ్రీశైలం నీటిని జూలై వరకు పంచడమే ప్రధాన ఎజెండా
- టెలీమెట్రీ పరికరాలపైనా చర్చ


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి పంపకాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 30న భేటీ కానుంది. సోమవారం ఈమేరకు భేటీ వివరాలను బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ ఇరురాష్ట్రాలకు లేఖ ద్వారా సమాచారం అందించారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మరింత దిగువకు వెళ్లి నీటిని పంపిణీ చేయాలన్న డిమాండ్లతోపాటు టెలీమెట్రీ పరికరాల అమరిక అంశాన్ని ప్రధాన ఎజెండాలో చేర్చారు.

గతంలో బోర్డు సమక్షంలో ఇరురాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్‌లో 502 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల వరకు నీటిని తీసుకోవాల్సి ఉంది. ఈ మట్టాల వద్ద ప్రస్తుతం కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే ఉండటం, ఆ నీరంతా ఏపీకే దక్కనుండటంతో తెలంగాణ తన అవసరాల కోసం రెండు ప్రాజెక్టుల్లో మరింత దిగువకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరుతోంది. సాగర్‌లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల మట్టం వరకు వెళ్లేందుకు అవకాశం ఇస్తే హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. నల్లగొండ తాగునీటికి 2.25 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటికి 2 టీఎంసీలు కావాలని ఇటీవలే విన్నవించింది. దీనిపై త్రిసభ్య కమిటీ నిర్ణయం చేయాల్సి ఉంది.

టెలీమెట్రీపై తెలంగాణ ఆగ్రహం
ఇక ఇదే భేటీలో కృష్ణా జలాల వినియోగంపై పక్కా లెక్కలు ఉండేందుకు ఉద్దేశించిన టెలీమెట్రీ పరికరాలపైనా చర్చ జరగనుంది. ఈ పరికరాల అమరిక విషయంలో ఇప్పటికే తెలంగాణ ఉడుకుమీదుంది. మొదటి విడతలో గుర్తించిన 18 పాయింట్లలో చాలా చోట్ల తెలంగాణలో వాటిని అమర్చే పనులు పూర్తయినా, ఏపీలో పూర్తి కాలేదు. రెండో విడతలో మరో 28 చోట్ల అమర్చాల్సి ఉండగా, 17 పాయింట్లపై తమకు అభ్యంతరాలు ఉన్నాయంటూ ఏపీ అడ్డుపడుతోంది. దీనిపై ఇదివరకే బోర్డుకు ఫిర్యాదు చేసినా పెద్దగా స్పందన లేకపోవడంతో త్రిసభ్య కమిటీలోనే తేల్చుకోవాలని తెలంగాణ గట్టి పట్టుదలతో ఉంది.

పక్షపాత ధోరణి వద్దు: హరీశ్‌
టెలీమెట్రీ పరికరాల అమరిక అంశమై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. టెలీమెట్రీ పరికరాల అమరికలో పక్షపాత ధోరణి వద్దని, ఇరురాష్ట్రాల్లో సమానంగా ఏర్పాటు చేసేలా చేర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గోదావరి బోర్డు చైర్మన్‌ హెచ్‌కే సాహుతో సైతం వివిధ అంశాలపై చర్చించారు.

>
మరిన్ని వార్తలు