ఎట్టకేలకు శాశ్వత ఎండీ నియామకం | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు శాశ్వత ఎండీ నియామకం

Published Tue, May 23 2017 3:39 AM

The government issued orders for appointing REC's MD p ramesh

ఆర్‌ఈసీఎస్‌కు ఎండీగా డిప్యుటీ రిజిస్టార్‌ రమేష్‌ను నియమిస్తూ ఉత్తర్వులు
15 ఏళ్ల తర్వాత రానున్న శాశ్వత ఎండీ


చీపురుపల్లి: గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం(ఆర్‌ఈసీఎస్‌)కు ఎట్టకేలకు శాశ్వత ఎండీ నియామకం జరగనుంది. దాదాపు పదిహేనేళ్లుగా ఎఫ్‌ఏసీ(ఫుల్‌ అడిషినల్‌ చార్జెస్‌) ఎండీలతో కాలం గడుపుతూ వచ్చిన నేపథ్యంలో తాజాగా శాశ్వత ఎండీను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఆర్‌ఈసీఎస్‌ పురోగతికి దోహదపడే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. గుంటూరులోని సహకారశాఖ కమిషనర్‌ కార్యాలయంలో డిప్యుటీ రిజిస్టార్‌గా పని చేస్తున్న పి.రమేష్‌ను శాశ్వత ఎండీ హోదాలో నియమిస్తూ సహకార శాఖ కమిషనర్‌ ఆర్‌సీ నంబరు 3493తో కూడిన ఉత్తర్వులు విడుదల చేశారు.

దీంతో రెండు, మూడు రోజుల్లో ఆయన ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంస్థకు చివరిసారిగా 2001–02లో సహకార శాఖ అడిషనల్‌ రిజిస్టార్‌ ఎంఎస్‌ఎన్‌.మూర్తి శాశ్వత ఎండీగా విధులు నిర్వహించారు.ఆ తర్వాత నుంచి ఇంతవరకు అందరూ ఎఫ్‌ ఏసీ ఎండీ హోదాలోనే బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్ల హయాంలో ఎఫ్‌ఏసీ అయినప్పటికీ బాంధవరావు ఒక్కరే ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు.

మూడేళ్లలో నలుగురు మారారు...
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో నలుగురు ఎండీలు మారాల్సి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మొదటిగా డిప్యుటీ కలెక్టర్‌ హెచ్‌వి.జయరాంను ఎఫ్‌ఏసీ ఎండీగా నియమించారు. ఆయన సంస్థను గాడిలో పెడుతున్న సమయంలో ఆ స్థానంలో డ్వామా పీడీ ప్రశాంతికి బాధ్యతలు అప్పగించారు. ఆమె కూడా కొద్ది కాలం పని చేసి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. దీంతో డీఆర్‌డీఏ పీడీ ఢిల్లీరావుకు బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే ఆయనకు బదిలీ అవ్వడంతో ఆ బాధ్యతలను జెడ్పీ సీఈఓ రాజకుమారికి అప్పగించారు. ఇలా మూడేళ్లలో నలుగురు ఎండీలు మారారు.

వీరంతా జిల్లా స్థాయిలో ఇతర పోస్టుల్లో ఉంటూ ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో ప్రత్యేక దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. ఎఫ్‌ఏసీ బాధ్యతలు కదా మనకెందుకులే అన్న చందంగా పలువురు అధికారులు భావించడంతో పలు అభివృద్ధి పనులకు ఆటంకం కూడా ఏర్పడింది. అయితే తాజాగా సంస్థకు శాశ్వత ఎండీను నియమించడం ఆయనకు ఇతర బాధ్యతలు లేకపోవడంతో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించగలరన్న చర్చ స్థానికంగా జరుగుతోంది.

సంస్థ అభివృద్ధి కోసమే శాశ్వత ఎండీ..

ఆర్‌ఈసీఎస్‌ అభివృద్ధి కోసమే ప్రభుత్వం శాశ్వత ఎండీ నియామకం చేపట్టిందని ఆ సంస్థ చైర్మన్‌ దన్నాన రామచంద్రుడు తెలిపారు. శాశ్వత ఎండీ కోసం ఎమ్మెల్యే కిమిడి మృణాళిని చాలా కృషి చేశారని, ఆమె చొరవతోనే డిప్యుటీ రిజిస్టార్‌ పి.రమేష్‌ను ఎండీగా ప్రభుత్వం నియమించదని మరో రెండు రోజుల్లో ఆయన విధుల్లో చేరనున్నారని పేర్కొన్నారు.





 

Advertisement
Advertisement