కృష్ణా బోర్డుకు ‘సాగర్‌’

4 Dec, 2023 05:21 IST|Sakshi

సీఆర్‌పీఎఫ్‌ బలగాల పహారాలో ప్రాజెక్టు నిర్వహణ

సాక్షి, అమరావతి/మాచర్ల/విజయపురిసౌత్‌: ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. కేంద్ర హోంశాఖ, జల్‌ శక్తి శాఖల కార్యదర్శులు అజయ్‌ బల్లా, దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు తెలంగాణ భూభాగంలోని నాగార్జునసాగర్‌ సగం స్పిల్‌ వే, ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోని స్పిల్‌వే, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను కూడా అప్పగించాలన్న కేంద్ర జల్‌ శక్తి శాఖ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో ఏపీ భూభాగంలోని స్పిల్‌వే, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను రాష్ట్ర పోలీసులు ఆదివారం సీఆర్‌పీఎఫ్‌ బలగాలకు అప్పగించి నీటి విడుదలను నిలిపివేశారు. 13వ క్రస్ట్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. ఇకపై నాగార్జున సాగర్‌ను సీఆర్‌పీఎఫ్‌ బలగాల పహారాలో కృష్ణా బోర్డు నిర్వహించనుంది.

ఉమ్మడి ప్రాజెక్టుల బాధ్యత బోర్డుకే..
కృష్ణాలో వరద ప్రారంభం కాకుండానే తెలంగాణ సర్కార్‌ 2021 జూలైలో బోర్డు అనుమతి తీసుకోకుండా అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి నీటిని దిగువకు వదిలేసి శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏపీ  హక్కులను పరిరక్షించేలా కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. ఈ కేసు విచారణలో ఉండగానే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌ శక్తి శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించాలని ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఆరు అవుట్‌లెట్లను ఏపీ ప్రభుత్వం,  తొమ్మిది అవుట్‌లెట్లను తెలంగాణ సర్కార్‌కు అప్పగించేందుకు కృష్ణా బోర్డు 15వ సర్వ సభ్య సమావేశంలో అంగీకారం తెలిపాయి. తెలంగాణ సర్కార్‌ తన భూభాగంలోని అవుట్‌ లెట్లను అప్పగిస్తే తమ భూ భాగంలోని ఆరు అవుట్‌లెట్లను అప్పగించడానికి సమ్మతి తెలుపుతూ 2021 అక్టోబర్‌ 14న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే తన భూభాగంలోని 9 అవుట్‌లెట్లను అప్పగించకుండా తెలంగాణ సర్కార్‌ అడ్డం తిరగడంతో అప్పట్లో గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి రాలేదు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ సర్కార్‌ అనుసరిస్తున్న దుందుడుకు వైఖరితో ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికి శాంతి భద్రతల సమస్యగా మారుతుండటంతో ఏపీ హక్కుల పరిరక్షణకు సాగర్‌ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఈ వివాదాన్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగిన కేంద్రం నాగార్జునసాగర్‌ను కృష్ణా బోర్డుకు అప్పగించడం ద్వారా నోటిఫికేషన్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 6న ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి నిర్వహించే సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా శ్రీశైలాన్ని బోర్డుకు అప్పగించే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చరమగీతం పాడాలని కేంద్రం నిర్ణయించింది. 

నీటిపై నేడు త్రిసభ్య కమిటీ భేటీ
నాగార్జునసాగర్‌ కుడి కాలువకు 5 టీఎంసీలు విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం కృష్ణా బోర్డుకు ప్రతిపాదన పంపింది. దీనిపై త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని బోర్డును కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సోమవారం సమావేశమై నిర్ణయం తీసుకోనుంది.  

>
మరిన్ని వార్తలు