ఆందోళన బాటలో ఎల్‌పీజీ డీలర్లు

27 Oct, 2016 03:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్లక్ష్య వైఖరికి నిరనసగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు భారత ఎల్‌పీజీ డీలర్ల సమాఖ్య ప్రకటించింది. ఢిల్లీలో సమావేశమైన అన్ని రాష్ట్రాలకు చెందిన సమాఖ్య ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపింది. గ్యాస్‌ సిలిండర్లు తీసుకెళ్లే, వినియోగించే వారికి ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, రకరకాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కొత్త డిస్ట్రిబ్యూటర్లను నియమించరాదని, కమీషన్‌ పెంచాలని, పటిష్టమైన లాకింగ్‌ కలిగిన సిలిండర్లు మాత్రమే సరఫరా చేయాలని, 5 కిలోల సిలిండర్లను అందుబాటులోకి తేవాలనే తదితర డిమాండ్లను సమాఖ్య చాలా కాలంగా చేస్తోంది.

వీటిని ఆయిల్‌ కంపెనీలు, పెట్రోలియం శాఖలు పట్టించుకోకపోవడంతో ఆందోళన ప్రణాళిక రూపొందించినటు సమాఖ్య జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రావు, పవన్‌సోని తెలిపారు. నవంబరు 5 నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఆరంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను చైతన్య పరిచేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తారు. నవంబరు 22న అర్ధరోజు పాటు డిస్ట్రిబ్యూటర్‌ కార్యాలయాలు మూసివేస్తారు. నవంబర్‌ 29, డిసెంబర్‌ 1న పూర్తిరోజు కార్యాలయాలు మూసివేస్తారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో డిసెంబరు 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతారు.

మరిన్ని వార్తలు