కొత్త విధానంతో దూకుడు

12 Dec, 2014 02:21 IST|Sakshi

మావోయిస్టుల అదుపునకు కేంద్రం కొత్త పాలసీ
సాక్షి, హైదరాబాద్: నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీ కార్య కలాపాలపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త విధానంతో ఉక్కు పాదం మోపనుంది.  దీనికి సంబంధించి  తెలంగాణతో సహా పది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల  డీజీపీల నుంచి  సూచనలను, ఈ విధానం ఎలా ఉండాలనే విషయమై  అభిప్రాయాలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ  సేకరించింది.  

ఢిల్లీలో బుధవారం జరిగిన మావోల ప్రభావిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్,పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ డీజీపీల సమావేశంలో  కొత్త పాలసీని తీసుకు రావాలని నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో  మావోయిస్టులకు గిరిజనుల మద్దతు లభించడానికి  ప్రధాన కారణం  ఆ ప్రాంతాలు అభివృద్ధికి  సుదూరంగా ఉండటమేనని ఈ సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మతో సహా పలు రాష్ట్రాల డీజీపీలు  పేర్కొన్నారు.

కనీసం సౌకర్యాల లేమి, వివిధ ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలు వారికి చేరక పోవడం  వంటి కారణాలు కూడా కారణమవుతున్నాయని  డీజీపీలు వివరించారని తెలిసింది.  ఒక పక్క అభివృద్ధి మరో పక్క ఆపరేషన్స్ విధానంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్ పెట్టగలిగామని  ఇరు రాష్ట్రాల డీజీపీలు అనురాగ్‌శర్మ, జేవీ రాముడు పేర్కొన్నారు. నిరంతర నిఘా,  నల్లమల అటవీ ప్రాంతంలో తరచూ గాలింపు చర్యలు చేపట్టడంవల్ల ప్రస్తుతం  పరిస్థితి అదుపులో ఉందన్నారు.

దండకారణ్యం  పరిధిలో ఉన్న మావోల ప్రభావిత  రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచినప్పుడే  వారికి  దీటైన జవాబు చెప్పగలమని  రాష్ట్ర డీజీపీ శర్మ సూచించారు.  ఈ సమస్యను జాతీయ సమస్యగా పరిగణించాలనే సూచనను  కేంద్ర హోంశాఖ వ్యతిరేకించినట్లు  తెలిసింది. అవసరమైన కేంద్ర బలగాలను సంబంధిత రాష్ట్రాలకు పంపుతామని చెప్పింది. వివిధ రాష్ట్రాల డీజీపీల నుంచి అందిన సూచనలు, నివేదికలను పరిశీలించి  వచ్చే పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త విధాన నిర్ణయాన్ని  ప్రకటించనుందని  అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు