దుప్పటి అడ్డుపెట్టి దోపిడీ

7 Jun, 2016 23:34 IST|Sakshi
దుప్పటి అడ్డుపెట్టి దోపిడీ

20 నిమిషాల్లో ‘పని’ పూర్తి
అపెక్స్’ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులుహైదరాబాద్:

 

తాళం పగలగొట్టలేదు.. షట్టర్ ధ్వంసం చేయలేదు.. ఏడుగురు వచ్చారు.. ఇద్దరు లోపలికి వెళ్లారు.. 20 నిమిషాల్లో ‘పని’ పూర్తిచేసుకుని రూ.25 లక్షలు సొత్తు ఎత్తుకుపోయారు. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ‘అపెక్స్’ యాపిల్ మొబైల్ ఔట్‌లెట్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ నేపథ్యమిది. షాపు నిర్వాహకుల నిర్లక్ష్యం సైతం దుండగులకు కలిసొచ్చిందని పోలీసులు భావిస్తున్నారు.

 
ఏడుగురు దొంగలు.. రెండు దుప్పట్లు..

‘అపెక్స్’ దుకాణం బయట ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను బట్టి ఏడుగురు సభ్యుల ముఠా ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. వీరిలో నలుగురి వీపులకు బ్యాగులు ఉన్నాయి. తెల్లవారుజామున 3.39 గంటలకు దుకాణం దగ్గరకు వచ్చిన దోపిడీ గ్యాంగ్.. బ్యాగుల్లోంచి రెండు దుప్పట్లు బయటకు తీసింది. షట్టర్‌కు కుడివైపుగా ఇద్దరు దుండగులు వాటిని తెరిచి అడ్డంగా పట్టుకున్నారు. ఎవరైనా  ఆ సమయంలో వాళ్లను చూస్తే దుప్పట్లు పర్చుకుని పడుకున్నారని భావించేలా జాగ్రత్తపడ్డారు. దుకాణం షట్టర్‌కు సెంటర్ లాక్ వ్యవస్థ ఉన్నప్పటికీ నిర్వాహకులు అది వేయలేదు. కుడి, ఎడమ చివర ఉండే తాళాలు మాత్రమే వేశారు. షట్టర్ సాధారణం కంటే కాస్త ఎక్కువ వెడల్పు ఉండడం కూడా దొంగలకు కలిసొచ్చింది. దుండగులు రాడ్‌తో షట్టర్ ను కాస్త పైకి ఎత్తారు. ఆ ఖాళీ లోనుంచి ఇద్దరు లోపలికి ప్రవేశించగా.. మిగిలిన వారు ‘దుప్పటి మడతపెట్టి’ దూరంగా వెళ్లి కాపుకాశారు. 2 నిమిషాల్లోనే ఈ తతంగం పూర్తి చేశారు. షట్టర్ వెనుక.. దుకాణం లోపలి వైపు గ్లాస్ ఫిటింగ్, డోర్ ఉన్నప్పటికీ దానికి లాక్ లేకపోవడంతో దుండగుల పని తేలికైంది.

 

ఫోన్లు మాత్రమే..

దుకాణంలో యాపిల్ ఫోన్లతో పాటు లాప్‌టాప్స్ కూడా ఉన్నా దొం గలు కేవలం సెల్‌ఫోన్లు ఉన్న సెల్ఫ్‌ను చిన్న రాడ్డుతో పగులకొట్టారు. ఒకడు అందులోని ఫోన్లను బయటకు తీసి ఇస్తుండగా.. మరొకడు బాక్సుల్లో నుంచి ఫోన్లను వేరుచేశాడు. తర్వాత క్యాష్ కౌంటర్‌ను పగులకొట్టి అందులోని రూ.51 వేల నగదు తీసుకున్నారు. ఆపై రూ. 24.85 లక్షల విలువైన ఫోన్లను బ్యాగ్‌లో సర్దుకుని పారిపోయారు. ఈ మొత్తం చోరీ 20 నిమిషాల్లో పూర్తయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఉత్తరాదికి చెందిన అంతర్రాష్ట్ర ముఠా పక్కా రెక్కీ తర్వాత ఈ చోరీ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. యాపిల్ ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిటీ(ఐఎంఈఐ) నంబర్లు క్లోనింగ్ చేయడం సాధ్యం కాదు. వాటిని దేశంలో ఎక్కడ విక్రయించినా పోలీసులు సాంకేతికంగా ట్రాకింగ్ చేసి గుర్తిస్తారు. దీంతో సొత్తును వివిధ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించే ఆస్కారం ఉందని అనుమానిస్తున్నారు. దుండుగులు వచ్చిపోయిన మార్గాలను గుర్తించడానికి ‘అపెక్స్’ నుంచి అన్ని వైపులకు ఉన్న రహదారుల్లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. వీరు రైలులో వచ్చి వెళ్లి ఉంటారనే అనుమానంతో రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించాలని నిర్ణయించారు.

>
మరిన్ని వార్తలు