'యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు'

13 May, 2016 12:30 IST|Sakshi

హైదరాబాద్ : నాచారంలోని శాలిస్లైట్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న ఆయన హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చన్నారు. ప్రమాదం వెనుక ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. మంటలను అదుపు చేసేందుకు నీటి సమస్య లేకుండా జీహెచ్ఎంసీ ట్యాంకర్లను తీసుకొస్తున్నట్లు చెప్పారు. అలాగే నగరం మధ్యలో ఉన్న ఫ్యాక్టరీలను తరలించే ప్రయత్నం చేస్తున్నామని మేయర్ తెలిపారు.

మంటలార్పేందుకు ఇంకా సమయం పడుతుందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని రియాక్టర్లు వరుసగా పేలుతుండటంతో మంటలు ఎగిసి పడుతున్నాయన్నారు. మంటల దగ్గరకు వెళ్లడం సాధ్యం కావటం లేదని తెలిపారు. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

కాగా ఉదయం తొమ్మిది గంటలకు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని వాచ్మెన్ తెలిపాడు. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించి, మంటలు పెరిగాయని పేర్కొన్నాడు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 60 నుంచి 70మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించాడు. కాగా ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్నవారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో ఇదే ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంతో నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి.

ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. మంటలార్పేందుకు కావాల్సిన పరికరాలు కూడా ఫ్యాక్టరీలో లేవని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ యజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలన్నారు. కాగా ప్రమాదం జరగగానే అందర్ని అప్రమత్తం చేసినట్లు మల్కాజ్గిరి ఏసీపీ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకూ తెలియదని, భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు