షార్ట్‌ సర్క్యూట్‌.. రసాయనాలు '9 ప్రాణాలు బుగ్గి'

14 Nov, 2023 01:47 IST|Sakshi
నాంపల్లి బజార్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం జరిగిన భవనం వద్ద సహాయక చర్యలు. (ఇన్‌సెట్‌)లో చిన్నారిని కాపాడుతున్న దృశ్యం.. చెలరేగుతున్న మంటలు

హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం

నాంపల్లి బజార్‌ఘాట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు 

ప్లాస్టిక్‌ షీట్ల బండిళ్లు, రసాయనాల టిన్నులకు అంటుకోవడంతో ఎగసిన అగ్నికీలలు 

పై అంతస్తులకు వ్యాపించిన మంటలు, దట్టమైన పొగ.. ఊపిరి ఆడక అపస్మారక స్థితికి చేరడంతో ప్రాణ నష్టం 

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు 

మరో 9 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం 

గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్, రేవంత్, అసదుద్దీన్‌ తదితరుల దిగ్భ్రాంతి 

ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ తదితర రాష్ట్ర మంత్రులు 

బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: హైదరాబాద్‌ నాంపల్లి బజార్‌ఘాట్‌లోని బాలాజీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నికీలలు ఎగసి పడటం, రసాయనాల వల్ల వెలువడిన పొగ పీల్చి అపస్మారక స్థితిలోకి చేరడం, ఆపై మంటలు అంటుకోవడంతో ఇద్దరు చిన్నారుల సహా తొమ్మిది మంది అశువులు బాసారు. మరో తొమ్మిది మందికి గాయాలు కాగా..వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.

కాగా అపార్ట్‌మెంట్‌లో ఉన్న మరో 21 మందిని అగ్నిమాపకశాఖ అధికారులు కాపాడారు. ఘటనాస్థలిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని, మహమూద్‌ అలీ తదితరులు సందర్శించారు. ప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన కాంగ్రెస్‌ నాంపల్లి అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో హార్డ్‌వేర్‌ గోదాం... 
బజార్‌ఘాట్‌కు చెందిన రమేష్‌ జైశ్వాల్‌కు స్థానికంగా బాలాజీ రెసిడెన్సీ పేరుతో అపార్ట్‌మెంట్‌ ఉంది. జీ+ఫోర్‌గా నిర్మితమైన ఇందులో ప్రస్తుతం ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి. ఆరింటిలో వేర్వేరు కుటుంబాలు, నాలుగో అంతస్తులో ఉన్న రెండింటిలో కలిపి ఒకే కుటుంబం నివస్తోంది. నగర శివార్లలో ప్లాస్టిక్‌ పరిశ్రమ ఉన్న రమేష్‌ జైశ్వాల్‌ నీలోఫర్‌ ఆస్పత్రి రోడ్డులో బాలాజీ హార్డ్‌వేర్‌ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. తన పరిశ్రమకు, దుకాణానికి సంబంధించిన రసాయనాలు, వస్తువులను నిల్వ చేయడానికి బాలాజీ రెసిడెన్సీ గ్రౌండ్‌ ఫ్లోర్‌ను గోదాముగా మార్చుకున్నాడు.

ఇందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇందులో ఫైబర్‌ ఎయిర్‌ కూలర్ల బాడీలు తయారీకి వినియోగించే బెంజైల్‌ నైట్రేట్‌ (మిౖథెల్‌ బెంజిన్‌) టిన్నులు, గేట్లకు వాడే ప్లాస్టిక్‌ షీట్లు (పాలీ షీట్లు), ప్లాస్టిక్‌ కార్పెట్లతో పాటు వీటిని అతికించడానికి ఉపకరించే రెజిన్‌ రసాయనం డ్రమ్ములు నిల్వ ఉంచాడు. వీటితో పాటు ప్రింటింగ్‌ ప్రెస్‌లకు సరఫరా చేసే సామాగ్రిని కూడా దాచాడు. సమీపంలోని ఇంకో అపార్ట్‌మెంట్‌ వద్ద కూడా ఇలాంటిదే మరో గోదాం ఉంది.  

ప్లాస్టిక్‌ బండిళ్లు కరిగి రోడ్డు పైకి.. 
ఉదయం 9.15 సమయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యింది. నిప్పు రవ్వలు లోపల ఉన్న పాలీ షీట్లపై పడటంతో మంటలు చెలరేగాయి. తర్వాత రసాయనాలకు సైతం అంటుకోవడంతో పెద్దయెత్తున మంటలతో పాటు పొగ, విష వాయువులు వెలువడ్డాయి. మంటల్లో పాలీ షీట్లు ఇతర ప్లాస్టిక్‌ బండిళ్లు కరగడంతో మంటలతో కూడిన ఆ ద్రవం బయటకు రోడ్డుపైకి సైతం ప్రవహించింది. ఆ మంటలు కాస్తా రోడ్డుపై ఉన్న వాహనాలకు అంటుకున్నాయి.  

రెండు, మూడు అంతస్తుల్లో ప్రాణ నష్టం 
మొదటి అంతçస్తులో నివసిస్తున్న కుటుంబాలు మంటలు గమనించి అప్రమత్తమై కిందికి వచ్చేశాయి. కొద్దిసేపటికే మంటలు, పొగ రెండు, మూడు, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో ఎవరూ లేరు. రెండో అంతస్తులో నివసించే మహ్మద్‌ ఆజం (58), ఆయన భార్య రెహానా సుల్తానా (50), కుమారుడు హసీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (32), చిన్న కుమార్తె ఫైజా సమీన్‌ (26), పెద్ద కుమార్తె తహోరా ఫరీన్‌ (35), ఈమె కుమార్తెలు తోబా (6), తరోబాలతో  (13) పాటు మూడో అంతస్తులో నివసించే మహ్మద్‌ జకీర్‌ హుస్సేన్‌ (66), ఆయన భార్య నిఖత్‌ సుల్తానా (55) పొగ పీల్చడంతో అపస్మారక స్థితికి చేరుకుని మంటలు అంటుకోవడంతో మరణించారు.

మరో 21 మందిని అగ్నిమాపక శాఖ అధికారులు రక్షించారు. వీరిలో కొందరికి కాలిన గాయాలయ్యాయని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. తల్హా (19) అనే యువతి 75 శాతం కాలిన గాయాలతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు.  

లోపలికి వెళ్ళలేకపోయిన స్థానికులు.. 
సెలవు దినం కావడంతో సోమవారం ఉదయం బజార్‌ఘాట్‌ ప్రాంతంలో పెద్దగా హడావుడి లేదు. కాగా అగ్నిప్రమాదంతో అపార్ట్‌మెంట్‌తో పాటు బయటి వాహనాలూ దగ్ధమయ్యాయి. రసాయనాల డ్రమ్ములు పగిలిపోయాయి. కరిగిన ప్లాస్టిక్‌ ద్రవంతో పాటు మంటలూ రోడ్డు పైకి వచ్చాయి. రసాయనాల కారణంగా తీవ్రమైన ఘాటు వాసనలు వెలువడ్డాయి. దీంతో స్థానికులు అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చినా సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. ఏడు ఫైరింజన్లతో పాటు వచ్చిన అగ్నిమాకప శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. అపార్ట్‌మెంట్‌ కుడి భాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో మొత్తం భవనంలో ఎవరూ ఉండకుండా ఖాళీ చేయించారు.

మంటలు ఆరిన తర్వాత కూడా డ్రమ్ముల్లోని రసాయనాలు వీధుల్లో మురిగి నీరులా ప్రవహించాయి. అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో పాటు స్థానికుల కాళ్ళు, వ్రస్తాలు, పాదరక్షలకు ఇవి మందమైన పొరలా అంటుకున్నాయి. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, నాంపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సీహెచ్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్, కాంగ్రెస్‌ నేతలు వి.హనుమంతరావు తదితరులు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్, డిప్యూటీ కమిషనర్‌ ఆంజనేయులు, ఫైర్స్‌ డీజీ వై.నాగిరెడ్డి, అదనపు సీపీ విక్రమ్‌ సింగ్‌ మాన్, డీసీపీ వెంకటేశ్వర్లు సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఐపీసీతో పాటు ఎక్స్‌ప్లోజివ్స్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసిన అధికారులు పరారీలో ఉన్న అపార్ట్‌మెంట్‌ యజమాని రమేష్‌ జైశ్వాల్‌ కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలకు ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. 

గవర్నర్, సీఎం సంతాపం 
 అగ్నిప్రమాదంలో 9 మంది మరణించడంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి రెండురోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎస్‌ను గవర్నర్‌ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.  

ఘటనా స్థలానికి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ 
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోం మంత్రి మహమూద్‌ అలీ తదితరులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. నగరంలో తరచూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్రమంగా జనావాసాల్లో కార్ఖానాలు ఏర్పాటు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని కిషన్‌రెడ్డి అన్నారు. వీటన్నింటినీ సుదూర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్‌ చేశారు.

బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, పీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద త్వరలోనే సహాయం అందజేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాగా అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోవడం అత్యంత బాధాకరమని కేటీఆర్‌ అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పు న ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని వేస్తామని తెలిపారు. నగరంలో వెలిసిన ఫ్యాక్టరీలను శివారు ప్రాంతాలకు తరలించేందుకు ఆరు నెలల క్రితమే ఒక ప్రణాళిక రూపొందించామని, త్వరలోనే దీనిని అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. 

అవి ప్రభుత్వ హత్యలే.. 
సీపీఐ నేతలు కె.నారాయణ, అజీజ్‌ పాషా, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు కూడా బజార్‌ఘాట్‌ను సందర్శించారు. అగ్ని ప్రమాదం కారణంగా సంభవించిన తొమ్మిది మరణాలూ ప్రభుత్వ హత్యలేనిని నారాయణ ఆరోపించారు. ప్రమాదానికి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఇలావుండగా ఘటనా స్థలంలో కాంగ్రెస్‌ పార్టీ నాంపల్లి అసెంబ్లీ అభ్యర్థి మహ్మద్‌ ఫిరోజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. కొందరు ఎంఐఎం కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయడం వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జితో ఇరు వర్గాలకు చెదరగొట్టారు.  

సెలవుల్లో పుట్టింటికి వచ్చి పిల్లలతో సహా.. 
అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఓ మహిళా డెంటల్‌ డాక్టర్‌  ఉన్నారు. రెండో అంతస్తులో నివసించే మహ్మద్‌ ఆజం పెద్దకుమార్తె తహోరా ఫరీన్‌ తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి మెహదీపట్నం ప్రాంతంలో నివసిస్తోంది. తన కుమార్తెలకు వరుస సెలవులు రావడంతో శుక్రవారం రాత్రి పుట్టింటికి వచ్చింది. సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో కుమార్తెలతో సహా మరణించింది. 

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. 
దాదాపు 25 ఏళ్ళుగా అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గోదాం కొనసాగుతోంది.  గత ఏడాది వాచ్‌మెన్‌ కుమార్తె అక్కడున్న రసాయనాలతో ఆడుకుంటూ అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత అనేకసార్లు ఈ అక్రమ గోదాంపై అధికారులకు ఫిర్యాదు చేశా. కానీ వారు పట్టించుకోలేదు. రమేష్‌ జైస్వాల్‌కు ముందు ఆయన తండ్రి కూడా ఇలానే నిర్వహించారు.  – మేరీ ప్రియ పాల్, స్థానికురాలు 

బతుకు‘బండి’ని కోల్పోయా... 
నా తండ్రి అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్‌ పక్కన ఉన్న ఇంటిలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. మేము కుటుంబంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నివసిస్తున్నాం. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఫుడ్‌ డెలివరీ చేయడాన్ని బతుకుతెరువుగా మార్చుకున్నా.  నేను ప్రతిరోజూ బైక్‌ను అపార్ట్‌మెంట్‌కు, నా యజమాని ఇంటి మధ్య ముందు భాగంలో ఉంచుతా. ఆదివారం రాత్రి కూడా అలాగే పార్క్‌ చేశా. సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ వాహనం కాస్తా కాలిపోవడంతో బతుకుతెరువు కోల్పోయా.  
– కిషోర్‌  

మరిన్ని వార్తలు